logo

అమ్మలేరు.. దాచలేరు

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో చర్యలు తీసుకుంటామన్న అధికారులు క్షేత్ర స్థాయిలో కార్యాచరణలోకి రావడంలేదు.

Updated : 31 May 2023 04:35 IST

కల్లాలు దాటని ధాన్యం
పెరుగుతున్న నిరసనలు
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌:

దోమ సమీపాన పొలంలోనే వడ్లు

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో చర్యలు తీసుకుంటామన్న అధికారులు క్షేత్ర స్థాయిలో కార్యాచరణలోకి రావడంలేదు. పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దీంతో గత్యంతరం లేక గోనె సంచుల కోసం కొందరు, కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మరికొందరు, మిల్లర్ల తిరకాసుతో ఇంకొన్ని చోట్ల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

54,162 ఎకరాల్లో వరి సాగు

జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 54,162 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేశారు. ఈలెక్కన అధికారులు 1.75లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎమ్మెఎస్‌, వ్యవసాయ మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో 124 కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించారు. వాటి పని తీరుమాత్రం తీసికట్టుగా మారుతోంది.  

చక్కబడని పరిస్థితులు..  

తప్పిదం ఎక్కడ జరుగుతుందో గుర్తించకుండా అధికారులు మిన్నకుండటంతో తమ కష్టాలు రెట్టింపవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సేకరణ, రవాణా, అన్‌లోడింగ్‌ తదితర అంశాలపై ఇటీవల జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్సు ద్వారా మాట్లాడినా పరిస్థితులు చక్కబడలేదు. ఐదు రోజుల క్రితం గన్నీ సంచుల కోసం తాండూరులో జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలోనూ రెండు రోజుల క్రితం, తాజాగా మంగళవారం జిల్లాలోని పలుచోట్ల ఆందోళనలు జరిగాయి.

చేతులెత్తేస్తున్న కేంద్రాల నిర్వాహకులు

అధికారుల లెక్కల ప్రకారం జిల్లాకు వాస్తవంగా 43లక్షల గన్నీ బస్తాలు అవసరం. కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో 44లక్షల బస్తాలు కొనుగోలు చేశారు. ఈ లెక్కన లక్ష ఎక్కువే పంపిణీ జరిగినా సమస్య ఎక్కడ వస్తుందన్నదే తేలడంలేదు. కేంద్రాల నిర్వాహకులు మాత్రం తమవద్ద బస్తాలు లేవని చేతులెత్తేస్తున్నారు. పొలాల వద్ద ఉన్న ధాన్యం చినుకు పడితే పాడవుతుందని త్వరగా ఇవ్వాలని నిత్యం కేంద్రాల చుట్టూరా రైతులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు.

భయపెడుతున్న వాతావరణ మార్పులు

వాతావరణంలో నిత్యం చోటు చేసుకుంటున్న మార్పులతో రైతన్నలు దినదినగండంగా గడపాల్సి వస్తోంది. ఇప్పటికే అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. చినుకు పడితే ధాన్యం తడుస్తుందని కనీస రక్షణ కూడా లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి కొనుగోళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని