logo

కార్ల గ్యారేజీలో భారీ అగ్నిప్రమాదం

నగరంలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ చౌరస్తాకు సమీప గుంటి జంగయ్యనగర్‌లోని ‘కార్‌ ఓ మ్యాన్‌’ గ్యారేజీ అగ్నికి ఆహుతైంది.

Updated : 31 May 2023 05:24 IST

పేలిన సిలిండర్లు.. ఎగసిన మంటలు
ఆహుతైన పలు కార్లు, సామగ్రి
ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిన స్థానికులు
పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం!

అగ్నికి ఆహుతి అవుతున్న గ్యారేజీ

ఈనాడు, హైదరాబాద్‌, నాగోల్‌, వనస్థలిపురం, కర్మన్‌ఘాట్‌, న్యూస్‌టుడే: నగరంలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ చౌరస్తాకు సమీప గుంటి జంగయ్యనగర్‌లోని ‘కార్‌ ఓ మ్యాన్‌’ గ్యారేజీ అగ్నికి ఆహుతైంది. రాత్రి    7.30గంటలకు గ్యారేజీ నుంచి దట్టమైన పొగలు వెలువడగా.. నిమిషాల్లో మంటలు చెలరేగాయి. ఓ గ్యాస్‌ సిలిండర్‌ భారీ శబ్దంతో పేలింది. పొగతో ఎల్బీనగర్‌ కూడలి పరిసరాలు భయానకంగా మారాయి. మూడు గంటలపాటు మంటలు అదుపులోకి రాలేదు. పక్కనున్న అపార్ట్‌మెంట్లకు నిప్పు రాజుకుంటుందనేలా మంటలు లేచాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శకటాలు తీవ్రంగా శ్రమించడంతో రాత్రి 10.30గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. గ్యారేజీ వెనుకనున్న గృహోపకరణాల షోరూంకు మంటలు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్‌ సర్కిల్‌ ఉపకమిషనర్‌ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీ+1 అంతస్తులో సుమారు 600గజాల్లో కార్ల గ్యారేజీ విస్తరించి ఉంది. రెండు వారాల క్రితం జనావాసాల్లో ఉన్న గ్యారేజీని బయటి ప్రాంతానికి తరలించాలంటూ గ్యారేజీకి నోటీసులందించగా, నిర్వాహకులు స్పందించలేదు. అంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తీవ్రతను చూసి పక్కనున్న శ్రీలక్ష్మి ఎన్‌క్లేవ్‌, ఎదురుగా ఉన్న శ్రీనిలయం వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అందులో ఉండేవారు విద్యుత్తు సరఫరా ఆపేసి ఇళ్లు ఖాళీ చేశారు. పొగ విపరీతంగా రావడం, ఆ ప్రాంతమంతా చీకట్లు అలముకోవడంతో చుట్టుపక్కల కాలనీల్లోనూ భయాందోళనలు రేగాయి. మూడు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ముందువైపు నుంచి గ్యారేజీలోకి వెళ్లారు. 20కార్లు మంటల్లో చిక్కుకున్నట్లు అంచనా. లోపలి వైపు నుంచి, బయటినుంచి నీటిని చిమ్మడంతో రెండు గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. గ్యారేజీలో వేడి ఇంకా తగ్గలేదని, లోపలున్న గ్యాస్‌ సిలిండర్లు రాత్రికి పేలే అవకాశముందని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ మాట్లాడుతూ.. నాలుగు కార్లను మాత్రం సురక్షితంగా బయటకు తీశామన్నారు. గ్యారేజీలో అగ్నిమాపక పరికరాలేవీ కనిపించలేదని తెలిపారు. జీహెచ్‌ఎంసీ విపత్తు స్పందన దళం, హయత్‌నగర్‌ డీసీ మారుతి దివాకర్‌ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్న గ్యారేజీ యజమాని విజయ్‌కుమార్‌.. ఆహుతైన గ్యారేజీని చూసి లబోదిబోమంటూ సొమ్మసిల్లిపడిపోయాడు. సుమారు రూ.2.5 నుంచి రూ.3కోట్ల వరకు ఆస్తినష్టం ఉంటుందని తెలిపారు. ‘రాత్రి 7గంటలకు గ్యారేజీ మూశారు. తర్వాత అరగంటకు లోపలి నుంచి పొగ రావడం మొదలైంది. మెల్లగా మంటలు మొదలయ్యాయి’ అని పక్కనే ఉన్న శ్రీలక్ష్మి నిలయంవాసి వెంకటేశ్వర్లు తెలిపారు.

మంటల్లో మాడి మసైన కార్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని