logo

నైటీ ధరించి.. సెల్‌షాపులో చోరీ

అతడు ఒక సెక్యూరిటీ గార్డు.. మొబైల్‌స్టోర్‌లో దొంగతనం చేయాలని పథకం వేశాడు. అనుమానం రాకుండా ముందే సెలవు పెట్టాడు. గుర్తించకుండా ఉండేందుకు సోదరి నైటీలో వచ్చి దుకాణం తాళం పగులగొట్టి మొబైల్‌ ఫోన్లు దొంగిలించి ఉడాయించాడు.

Updated : 01 Jun 2023 07:07 IST

నిందితుడి అరెస్టు
రూ.8.28 లక్షల 37 ఫోన్లు స్వాధీనం

నిందితుడు యాకయ్య

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: అతడు ఒక సెక్యూరిటీ గార్డు.. మొబైల్‌స్టోర్‌లో దొంగతనం చేయాలని పథకం వేశాడు. అనుమానం రాకుండా ముందే సెలవు పెట్టాడు. గుర్తించకుండా ఉండేందుకు సోదరి నైటీలో వచ్చి దుకాణం తాళం పగులగొట్టి మొబైల్‌ ఫోన్లు దొంగిలించి ఉడాయించాడు. సీసీ కెమెరాల రికార్డుల ద్వారా ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.8.28 లక్షల 37 రియల్‌మీ ఫోన్లు, ఒకట్యాబ్‌ స్వాధీనం చేసుకున్నారు. మహంకాళి ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాసులు, ఎసై శ్రీకాంత్‌ వివరాలు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలం మడిపల్లె వాసి మంకాల యాకయ్య అలియాస్‌ వినయ్‌(28).. తండ్రి చనిపోవడంతో ఉపాధి కోసం తల్లి, సోదరితో కలిసి ఐదేళ్ల కిత్రం నగరానికి వచ్చాడు. కంటోన్మెంట్‌ తాడ్‌బండ్‌లోని బాపూజీనగర్‌లో ఉంటున్నాడు. సికింద్రాబాద్‌ ఎస్‌డీరోడ్డులోని ఎమరాల్డ్‌ హౌస్‌లో సెక్యూరిటీగార్డు. రియల్‌మీ మరో మొబైల్‌ స్టోర్‌ సెక్యూరిటీ గార్డుగా గతంలో పనిచేశాడు. ఇప్పుడు పనిచేస్తున్న ఎమరాల్డ్‌ హౌస్‌ మొదటి అంతస్తులోనూ ఒక రియల్‌మీ స్టోర్‌ ఉంది. ఈ షాపులో సీసీ కెమెరాలు పనిచేయట్లేదనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ ఏడాది మే 24-26 వరకు అక్కడ పరిసరాలను పరిశీలించి చోరీకి పథకం వేశాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే సొంతూరు వెళ్తున్నట్లు చెప్పి సెలవు పెట్టాడు. మే 28 రాత్రి 12.30 గంటల సమయంలో సోదరి నైటీ ధరించి రియల్‌మీ దుకాణానికి మరోవైపు మూసి ఉండే షట్టర్‌ తాళం పగులగొట్టి ట్యాబ్‌, ఫోన్లతో సొంతూరు వెళ్లిపోయాడు. చోరీ జరిగినట్లు స్టోర్‌ ఇన్‌ఛార్జ్‌ మహ్మద్‌ యూసుఫ్‌.. మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటీజీ పరిశీలించారు. నైటీలో ఓ మహిళ ఆ సమయంలో వెళ్లడం గుర్తించి అనుమానించారు. సెక్యూరిటీ గార్డులను విచారించారు. యాకయ్యపై అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం మహబూబాబాద్‌ మడిపల్లెలో నిందితుడిని అరెస్టు చేశారు. అక్కడే ఉంచిన సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


నైటీలో చోరీకి వెళ్తున్న నిందితుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు