logo

మహిళల స్వయం సమృద్ధికి తోడ్పాటు

జిల్లా పట్టణ ప్రాంతాల్లో పేదరికంతో ఇబ్బంది పడుతున్న మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించేందుకు ‘మెప్మా’ విశేషంగా కృషి చేస్తోందని జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

Published : 01 Jun 2023 02:40 IST

మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ రవికుమార్‌తో ‘న్యూస్‌టుడే’

న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్‌: జిల్లా పట్టణ ప్రాంతాల్లో పేదరికంతో ఇబ్బంది పడుతున్న మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించేందుకు ‘మెప్మా’ విశేషంగా కృషి చేస్తోందని జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడం, తీసుకున్న రుణాలను సవ్యంగా చెల్లించిన మహిళలను ఆర్థికంగా మరింతగా ప్రోత్సహిస్తోందన్నారు. మహిళలకు రుణ మంజూరు విషయమై ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ముఖాముఖి’లో ఆయన పలు విషయాలను తెలిపారు.  

న్యూ: ఈ ఆర్థిక సంవత్సరం మహిళలకు రుణ లక్ష్యం ఉందా..?

జ: 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 480 మహిళా సంఘాలకు రూ.38 కోట్లు రుణాలు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే 2 కోట్లను ఇచ్చాం.  

న్యూ: నాలుగు పట్టణాల్లోని మెప్మా లబ్ధిదారులుగా ఎంతమంది ఉన్నారు?

జ: తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి పట్టణాల్లో కలిపి మొత్తం 2,430 మహిళా సంఘాలు, సభ్యులు 24,300 మంది, సమాఖ్యలు 107 ఉన్నాయి.

న్యూ: గతేడాది ఎన్నికోట్ల రుణాలు ఇచ్చారు?  

జ: గడచిన ఆర్థిక సంవత్సరంలో 520 సంఘాలకు రూ.35 కోట్ల రుణాలు ఇచ్చాం. ఈ ఆర్థిక సంవత్సరం ఇచ్చే రుణాలకు రూ.3 కోట్లు జోడించి రూ.38 కోట్లు ఇవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం.

న్యూ: సంఘాలకు ఇచ్చే రుణ పరిమితి ఏ మేరకు ఉంటుంది?

జ: ఒక సంఘంలో పది మంది మహిళలు ఉంటే మొదటిసారి రూ.లక్ష రుణం ఇస్తాం. రెండోసారి రూ.2లక్షలు, మూడోసారి రూ.5 లక్షల వరకు ఇస్తాం.  

న్యూ: రుణాలతో మహిళలు ఎలాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

జ: మహిళలు బృందాలుగా ఏర్పడి పచ్చళ్ల తయారీ, బ్యూటీ పార్లర్‌, మగ్గం తదితరాలు నిర్వహిస్తున్నారు. ఇంకొందరు మహిళలు వ్యక్తిగతంగా టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ వంటి వాటిని నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.  

న్యూ: ఆత్మ నిర్భర్‌కు వీధి విక్రయదారులు ఎంతమంది ఉన్నారు?

జ: తాండూరులో 2,946, వికారాబాద్‌లో 2,777, పరిగిలో 779, కొడంగల్‌లో 681 మంది చొప్పున మొత్తం 7,183 మంది వీది విక్రయదారులను గుర్తించాం. వీరిలో మొదటి దశలో 6,831 మందికి ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రుణాలు ఇచ్చాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని