logo

Hyderabad: కలిసి బతకలేమని.. విడిచి ఉండలేమని..

హయత్‌నగర్‌లో సంచలనం రేకెత్తించిన రాజేష్‌(25) ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో ఉపాధ్యాయురాలు(45), రాజేష్‌ ఇద్దరూ కలిసే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Updated : 01 Jun 2023 08:18 IST

మే 24న కుంట్లూరులో కలుసుకున్న ఉపాధ్యాయురాలు, యువకుడు
ఇద్దరూ ఒకేసారి పురుగుమందు తాగి బలవన్మరణం!

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: హయత్‌నగర్‌లో సంచలనం రేకెత్తించిన రాజేష్‌(25) ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో ఉపాధ్యాయురాలు(45), రాజేష్‌ ఇద్దరూ కలిసే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావులా పరుశురాములు, విజయ దంపతుల కుమారుడైన రాజేష్‌(25)  కుంట్లూర్‌ డాక్టర్స్‌ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తొలుత ఉపాధ్యాయురాలు తన వ్యక్తిగత ఫొటోలను రాజేష్‌కు చరవాణిలో పంపినట్లు తెలుస్తోంది. ఆమెపై అమితమైన ప్రేమను పెంచుకున్న రాజేష్‌.. ఆమె కోసం ఇంటిచుట్టూ తిరిగేవాడు. దీంతో  ఆమె.. కుటుంబాన్ని, రాజేష్‌ను వదులుకోలేని సందిగ్ధ పరిస్థితుల్లో చనిపోవాలని నిర్ణయించుకుంది.

ఈనెల 24న చివరిసారిగా కుంట్లూర్‌ డాక్టర్స్‌ కాలనీలో రాజేష్‌, ఆమె కలుసుకున్నట్లు తెలిసింది. ఇకపై తాము కలిసి బతకలేమని, ఒకరినొకరు విడిచి ఉండలేమనీ భావించిన వారిద్దరూ.. కలిసే చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. అంతకుముందే హయత్‌నగర్‌లోని ఓ ఫెర్టిలైజర్స్‌ దుకాణంలో గడ్డి మందును కొనుగోలు చేశారు. అక్కడే పురుగుమందు తాగిన ఉపాధ్యాయురాలు ఇంటికెళ్లింది. అనంతరం రాజేష్‌ కూడా.. పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఉపాధ్యాయురాలు ఇంటికి చేరుకున్నాక.. వాంతులవడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స పొందుతూ మే 29న మృతిచెందింది. కుంట్లూర్‌ పరిధిలో రాజేష్‌ మృతదేహాన్నీ అదేరోజు స్థానికులు గుర్తించారు. ¸దర్యాప్తులోభాగంగా.. రాజేష్‌, ఉపాధ్యాయురాలి ఫోన్‌కాల్స్‌తోపాటు సీసీటీవీ ఫుటేజ్‌లతో ఆధారాలు సేకరించారు. దర్యాప్తు తుదిదశకు చేర్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని