KTR: భాజపా, కాంగ్రెస్‌ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలి: మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో తిరిగి భారాస అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామన్నారు.

Updated : 01 Jun 2023 20:23 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారాస తిరిగి అధికారంలోకి వస్తుందని.. 90 నుంచి 100 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది ఆ పార్టీ ఇష్టం. ప్రజలు మతం ప్రాతిపదికనే ఓట్లు వేస్తారని నేను నమ్మను. ఎంఐఎం, కాంగ్రెస్, భారాసకు మాత్రమే ఓట్లేస్తారనేది కాదు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని నమ్ముతున్నా’’ అని కేటీఆర్‌ అన్నారు.

‘‘నీళ్లు, నిధులు, నియామకాల స్ఫూర్తితో పనిచేసి భారాస విజయం సాధించింది. తొమ్మిదేళ్లలో తెలంగాణ సమగ్ర, సమతుల, సమ్మిళిత అభివృద్ధిని సాధించింది. పరిపాలన సంస్కరణలు దేశంలో ఎక్కడా లేనంత వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పక్షాలకు పనిలేక తొమ్మిదేళ్లుగా అసత్య అరోపణలు చేస్తున్నారు. విపక్షాలు హేతుబద్ధంగా, రుజువులతో మాట్లాడలేక పోయాయి. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం నాకుంది. భాజపా, కాంగ్రెస్ నేతలకు ధైర్యముంటే తెలంగాణ కన్నా మంచి మోడల్ చూపించాలి. కాంగ్రెస్, భాజపా 75 ఏళ్లు చేయని పనిని తొమ్మిదేళ్లలో చేసి చూపిస్తున్నాం. కాంగ్రెస్, భాజపా పరిపాలన కొత్త సీసాలో పాత సారాలా ఉంటుంది.

ఇప్పుడే టికెట్ల విషయంలో ఏమీ చెప్పలేం...

తెలంగాణలో భాజపా లేనే లేదు. ఆ పార్టీ సోషల్ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు హంగామా చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మాతో పోటీ పడే పరిస్థితి లేదు. అధికారంలోకి వస్తామనే భ్రమల్లో కాంగ్రెస్ ఉంటే అది వారిష్టం. రాష్ట్రంలో షర్మిల, కేఏ పాల్ కూడా అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఈసారి మంచి పనితీరు ఉన్న పార్టీ  ఎమ్మెల్యేలందరికీసీట్లు దక్కుతాయి. పనితీరులో వెనుకబడిన ఎమ్మెల్యేలు మెరుగుపరచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి టికెట్ల విషయంలో ఏమీ చెప్పలేం’’ అని కేటీఆర్ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని