logo

తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా దశాబ్ది ఉత్సవాలు: మంత్రి

ఉద్యమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి కొనసాగుతోందని మంత్రి సబితారెడ్డి అన్నారు. పదేళ్లలోనే దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం గర్వకారణమన్నారు.

Published : 02 Jun 2023 03:11 IST

మాట్లాడుతున్న సబితారెడ్డి. వేదికపై జడ్పీ ఛైర్‌పర్సన్‌  అనితారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ శ్రీధర్‌

మీర్‌పేట, న్యూస్‌టుడే: ఉద్యమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి కొనసాగుతోందని మంత్రి సబితారెడ్డి అన్నారు. పదేళ్లలోనే దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం గర్వకారణమన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం భారాస ముఖ్యకార్యకర్తల సమావేశం మీర్‌పేట ఎస్‌వైఆర్‌ గార్డెన్స్‌లో గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ తెలంగాణను స్వల్పకాలంలోనే దేశానికి మణిహారంగా తీర్చిదిద్దిన తీరును ప్రజలకు వివరించే పండగ పేరే రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలన్నారు. ఇవి జూన్‌ 2న అమరుల త్యాగాలకు నివాళులు అర్పిస్తూ ప్రారంభమై 22న అమరవీరుల సంస్మరణ సభ, స్తూపం ఆవిష్కరణతో ముగుస్తాయన్నారు. రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు .. కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు ఉండదన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద మంజూరైన నిధుల వివరాలు ప్రజలకు తెలిసే విధంగా అన్ని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ శ్రీధర్‌ మాట్లాడారు.

స్వయం పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు

మహేశ్వరం: స్వరాష్ట్రాన్ని సాధించుకుని తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదోఏట అడుగిడుతున్న సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు  మంత్రి సబితారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వయం పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఆశించిన ప్రగతిని సాధించామన్నారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన తెలంగాణ నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు.

అధికారులతో సమీక్ష

మహేశ్వరం: దశాబ్ది ఉత్సవాలపై మహేశ్వరం నియోజకవర్గ అధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి రోజు జరిగే కార్యక్రమాల్లో ఆయా రంగాల్లో నియోజకవర్గం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేయాలన్నారు. ఆధ్యాత్మిక దినోత్సవం నాడు దేవాలయాలను, మసీదులు, చర్చిలను విద్యుత్తుకాంతులతో అలంకరించి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసేలా చూడాలన్నారు. విద్యాదినోత్సవం నాడు నియోజకవర్గానికి మంజూరైన నూతన కళాశాలల వివరాలు ప్రజలకు తెలపాలన్నారు. మన ఊరు.. మన బడిలో భాగంగా పనులు జరుగుతున్న పాఠశాలలతో పాటు ఇతర బడులకు మంజూరైన నిధుల వివరాలు చెప్పాలన్నారు. ఆ రోజు విద్యార్థులకు  ఏకరూప దుస్తులు, పాఠ్య, రాతపుస్తకాలు అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

వేడుకలను విజయవంతం చేయాలి

ఆమనగల్లు: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎంపీపీ అనిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. మండల పరిషత్తు కార్యాలయంలో గురువారం ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని, అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో నిర్వహించాలని కోరారు. ఎంపీడీవో ఫారూఖ్‌ హుస్సేన్‌, ఇన్‌ఛార్జి ఎంఈవో సర్ధార్‌నాయక్‌,  డిప్యూటీ తహసీల్దార్‌ నారాయణరెడ్డి, అన్నిశాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

పురాతన ఆలయాల అభివృద్ధికి కార్యాచరణ

మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలోని పురాతన ఆలయాలకు మహర్దశ పట్టనుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ పురపాలిక జెన్నాయిగూడ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేసిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావిర్యాలలో రూ.20లక్షల వ్యయంతో చేపట్టనున్న గౌడసంఘం సంక్షేమ భవన నిర్మాణానికి, రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న రావిర్యాల చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రావిర్యాల రెండోవార్డు నుంచి ఎల్లమ్మ ఆలయం వద్ద రూ.60లక్షలతో ఏర్పాటు చేసిన ఆకాశదీపాలను ఆమె ప్రారంభించారు.  నియోజకవర్గంలోని 8 పురాతన ఆలయాల్లో  మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సమీకృత మార్కెట్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిషనర్‌ వెంకట్రామ్‌, పురపాలిక ఛైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ ఛైర్మన్‌ వెంకట్రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్‌ శివశంకర్‌, పట్టణ భారాస అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు యాదగిరిరెడ్డి, శివకుమార్‌, రవి, సుమన్‌, భారాస నాయకులు పద్మారెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజు, శ్రీకాంత్‌, శేఖర్‌రెడ్డి, సురేష్‌ పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు