logo

రోజూ 30కిపైగా చోరీలు

ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో వారం నుంచి మే చివరివరకూ రాజధానిలో రోజూ సగటున 30కిపైగా దొంగతనాలు జరిగినట్లు నేర విభాగం అధికారులు చెబుతున్నారు. ఇందులో సాధారణ చోరీలతో(సెల్‌ఫోన్లు, వాహనాలు)పాటు, తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలు ఉన్నాయి.

Updated : 02 Jun 2023 04:37 IST

వేసవి నేపథ్యంలో నగరంపై దొంగల పంజా

ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో వారం నుంచి మే చివరివరకూ రాజధానిలో రోజూ సగటున 30కిపైగా దొంగతనాలు జరిగినట్లు నేర విభాగం అధికారులు చెబుతున్నారు. ఇందులో సాధారణ చోరీలతో(సెల్‌ఫోన్లు, వాహనాలు)పాటు, తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలు ఉన్నాయి.

ఒక్క రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఇప్పటివరకూ రోజూ సగటున 15 దాకా చోరీలు నమోదయ్యాయి. పోలీసులు అప్రమత్తమవడంతో ఈ సంఖ్య 10కి తగ్గినట్లు అధికారులు వివరించారు.

ఒక్కరుగా వస్తున్నారు.. దోచేస్తున్నారు

వేసవి కాలం వచ్చిందంటే అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో తిష్ఠ వేసేవి. చెడ్డీ గ్యాంగ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన ధార్‌, పార్థీ ముఠాలు బృందాలుగా వచ్చి దోపిడీ చేసి పరారయ్యేవి. మూడు కమిషనరేట్ల పోలీసులు సమష్టి కృషితో ఈ గ్యాంగ్‌ల ఆట కట్టించాయి. కొత్త ముఠాలు, నగరంలోని పాత నేరస్థులు చెలరేగిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఒక్కరే వచ్చి చోరీలు చేస్తున్నారు. ఇటీవల కుషాయిగూడ చోరీ ఉదంతమే దీనికి నిదర్శనం. ఓ ఇంట్లో కిటికీ తొలగించి రూ.8 లక్షల నగదు, 20 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. 2014 నుంచి పోలీసులకు చిక్కని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌ ఈ దోపిడీ చేశాడు. ఎల్బీనగర్‌ సీసీఎస్‌, హయత్‌నగర్‌ పోలీసులకు పట్టుబడ్డ ఘరానా దొంగ నల్లమోతుల సురేశ్‌ అలియాస్‌ ఎర్రోడు హయత్‌నగర్‌ పరిధిలో వారం రోజుల్లో నాలుగు చోరీలు చేశాడు. నిందితుడు మీర్‌పేట్‌, దుండిగల్‌, సరూర్‌నగర్‌లోనూ చేతివాటం చూపించాడు. తాజాగా ఫలక్‌నుమా పోలీసులు అరెస్టు చేసిన ఘరానా దొంగ సునీల్‌ శెట్టి ఈ ఏడాది అయిదు నెలల్లో 16 చోరీలు చేశాడు.

గస్తీ వైఫల్యం కారణమే..!

మూడు కమిషనరేట్ల పోలీసులు వేసవిలో నేరాల కట్టడికి ముందస్తు ప్రణాళికలతో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలూ చోరీలకు కారణమవుతున్నాయి. గస్తీ సిబ్బంది రాత్రి వేళ పెట్రోలింగ్‌ను తూతూమంత్రంగా కొనసాగించడం. కాలనీలు, గల్లీల్లో పెట్రోలింగ్‌ వాహనాలతో ఒకట్రెండు సార్లు చక్కర్లు కొట్టి వదిలేయడం. రాత్రిపూట సంచరిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికల్ని గుర్తించకపోవడం. దూరంగా విసిరేసినట్లు ఉండే ప్రాంతాలు, కాలనీలపై దృష్టి తక్కువగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. ఫలితంగా దొంగలు చెలరేగుతున్నారని చెబుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు