logo

స్త్రీనిధి రుణం.. పంపిణీకి తరుణం

జిల్లాలో మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు వ్యక్తిగతంగా అందించే స్త్రీనిధి రుణాల లక్ష్యాన్ని పాతిక శాతం పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.15 కోట్లు అదనంగా అందించనున్నారు.

Published : 03 Jun 2023 01:12 IST

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: జిల్లాలో మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు వ్యక్తిగతంగా అందించే స్త్రీనిధి రుణాల లక్ష్యాన్ని పాతిక శాతం పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.15 కోట్లు అదనంగా అందించనున్నారు. వీటితో స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగంలో ఆర్థిక ప్రగతి సాధించనున్నారు. వేల సంఖ్యలో సంఘాలకు లబ్ధి చేకూరనుంది. పథకంలోని సువిధ ద్వారా 48 గంటల వ్యవధిలో రూ.40 వేల రుణాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. రూ.75 వేల నుంచి రూ.3 లక్షల దాకా జీవనోపాధి రుణాలను పదిహేను రోజుల వ్యవధిలో మంజూరు చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చరవాణి ద్వారా దరఖాస్తు చేసిన వెంటనే సొమ్ము చెల్లిస్తున్నారు. వీటిని తిరిగి 24 నెలల నుంచి 60 నెలల వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. రూ.వందకు 92 పైసల చొప్పున వడ్డీ విధించగా ప్రైవేటు వడ్డీతో పోల్చితే తక్కువ ఉండటంతో మహిళలు ఉత్సాహంగా రుణాలు పొందుతున్నారు.

రాయితీపై ఉపాధి యూనిట్లు

ఈ రుణాల ద్వారా ఆదాయం పొందే యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు ప్రోత్సహిస్తున్నారు. వారు ఆసక్తి చూపే స్వయం ఉపాధి యూనిట్లపై రాయితీ ఇచ్చి ఏర్పాటు చేయిస్తున్నారు. ఆయా యూనిట్ల ద్వారా రోజు, నెలవారీ ఆదాయం పొందేలా అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధి యూనిట్లను విజయవంతంగా నిర్వహించేలా ఆరు నెలల పాటు పర్యవేక్షిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో పాడి పశుపోషణకు రూ.92,500 చొప్పున 300 యూనిట్లు, రూ.22,500 చొప్పున 400 కోళ్ల ఫారాలు, రూ.లక్ష చొప్పున కూరగాయల పందిళ్లు 12, 2 నుంచి 3 కిలోవాట్స్‌ సామర్థ్యం కల్గిన సౌర విద్యుత్తు ప్లాంట్లు 350, రూ.3లక్షల చొప్పున ఎలక్ట్రిక్‌ ఆటోలు 20, జనరిక్‌ మందుల దుకాణాలు 2, రూ.75వేల చొప్పున ద్విచక్ర వాహనాలు 30, ఇళ్ల మరమ్మతులు 20 యూనిట్లు ఇచ్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు లక్ష్యం ఖరారు చేశారు. వీటి ద్వారా మహిళలు ఎప్పటికప్పుడు ఆదాయం పొందనున్నారు.


ప్రక్రియ వేగవంతం చేస్తాం:

తుమ్మల వేణు, జిల్లా మేనేజరు, స్త్రీనిధి

రుణ మంజూరు ప్రక్రియ వేగవంతం చేస్తాం. నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యం. నెలనెలా సిబ్బందితో సమీక్షించి కార్యక్రమం సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. సభ్యులు తక్కువ వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేటు వడ్డీకి తీసుకుని ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దు.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు