logo

పట్టాలెక్కనున్న పోడు!

పోడు భూములకు పట్టాలను అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సమస్య పరిష్కారానికి కసరత్తు పూర్తిచేసింది.

Updated : 03 Jun 2023 05:18 IST

సీఎం ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు

న్యూస్‌టుడే, పరిగి: పోడు భూములకు పట్టాలను అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సమస్య పరిష్కారానికి కసరత్తు పూర్తిచేసింది. జూన్‌ 24నుంచి 30వ తేదీ వరకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే ముహూర్తాన్ని ఖరారు చేయడంతో పేదల చేతికి ఇక పట్టాలు అందనున్నాయి. భూములను సాగు చేసుకుంటున్న వారికి హక్కు పత్రాలను ఇస్తామని గతేడాది దరఖాస్తులను స్వీకరించిన సర్కారు క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి అర్హులను వడపోత పట్టింది. దీంతో రైతులు పత్రాల కోసం అప్పటి నుంచి నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో సర్కారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలోని చాలా గ్రామాల్లో పోడు సమస్య ఉంది. మొత్తం జిల్లా వైశాల్యం 8,85,683 ఎకరాలు ఉండగా అటవీ వైశాల్యం 1,08,791.08 ఎకరాలు. అటవీ బ్లాకుల సంఖ్య 93. ఏడాదిన్నర క్రితం జిల్లా వ్యాప్తంగా సుమారు 23వేల ఎకరాలకు గాను 9703 దరఖాస్తులు అందాయి. వీటిలో గిరిజనుల నుంచి 4,692 దరఖాస్తులు అందగా ఇతరుల నుంచి 5,011 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన వాటిని క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టిన అధికారులు జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో చివరకు 436 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. వీరికి 552.30 ఎకరాల భూమిని ఖరారు చేసి పోడు పట్టాలను అందజేయనున్నారు. ఇందుకోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా దశాబ్దాల తరబడి అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పోడు భూములు పట్టాలు పొందిన వారికి రైతుబంధు పథకం వర్తించనుంది. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి యజమానులకు నేరుగా రైతుబంధును జమచేయనుంది. ఇకమీదట వారికి పంట రుణాలు కూడా అందనున్నాయి.

పది మండలాల్లో..: జిల్లాలోని 19 మండలాలు ఉండగా పోడు భూములకు పట్టాలను అందించేది పది మండలాల్లోని లబ్దిదారులకు. ప్రధానంగా యాలాల, పూడూరు, పెద్దేముల్‌, పరిగి, కుల్కచర్ల, కొడంగల్‌, దోమ, ధారూరు, చౌడాపూర్‌, బషీరాబాద్‌ మండలాలు ఉన్నాయి. దరఖాస్తులు మాత్రం వేలల్లో ఉండగా లబ్ధిదారుల సంఖ్య అందులో సగానికి సగం కూడా లేకపోవడంతో ఎవరెవరికి అందుతాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


దశాబ్దాల సమస్యకు తెర

పోడు పట్టాల పంపిణీతో దశాబ్దాల సమస్యకు తెరపడనుంది. పంట సాగు చేసుకోవాలన్నా రుణం అందని పరిస్థితి. చివరకు అమ్ముకోవాలన్నా హక్కు పత్రాలు లేక పడుతున్న పాట్లు వర్ణనాతీతం. పంటసాగుకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధుకు దూరమే. రైతుబీమా కూడా వర్తించకపోవడంతో బాధిత కుటుంబాలకు రూ.5లక్షల సాయం కూడా అందకుండా పోతోంది. కనీసం ఇప్పటికైనా తమకు మేలు కలుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.


పారదర్శకంగా ఎంపిక

కోటాజి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి

గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పారదర్శకంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేశాం. ప్రభుత్వ నిబంధన ప్రకారం అర్హులైన వారికి పోడు పట్టాలు అందనున్నాయి. జిల్లా మొత్తంగా 436 మంది లబ్ధిదారులకు 552 ఎకరాలకు పట్టాలు వచ్చేనెల 24నుంచి కలెక్టర్‌ నేతృత్వంలో పంపిణీ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని