logo

మృత్యువుకు తలుపు తీశారు

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి దుర్మరణం పాలైంది. తల్లిదండ్రులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఆగి ఉన్న కారు డోరు హఠాత్తుగా తెరుచుకోవడంతో అది తగిలి వారు కిందపడ్డారు.

Published : 03 Jun 2023 03:43 IST

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
రోడ్డు పక్కన వాహనం నిలిపి డోర్‌ తీయడంతో బైక్‌ ఢీకొని..

ధనలక్ష్మి

విగతజీవిగా మారిన బిడ్డను చూసి రోదిస్తున్న తల్లి

నాగోలు: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి దుర్మరణం పాలైంది. తల్లిదండ్రులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఆగి ఉన్న కారు డోరు హఠాత్తుగా తెరుచుకోవడంతో అది తగిలి వారు కిందపడ్డారు. ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్రగాయాలై మృతిచెందింది. ఈ సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై రవికుమార్‌ కథనం ప్రకారం.. ఎల్బీనగర్‌ పరిధి ఎన్టీఆర్‌నగర్‌లో నివసిస్తున్న హబీబుద్దీన్‌, శశిరేఖ దంపతులకు రెండేళ్ల వయసున్న ధనలక్ష్మి సంతానం.  హబీబుద్దీన్‌ కారు డ్రైవర్‌ కాగా శశిరేఖ బ్యుటీషియన్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం పని నిమిత్తం మన్సూరాబాద్‌కు వచ్చిన శశిరేఖను తిరిగి ఇంటికి తీసుకువెళ్లేందుకు హబీబుద్దీన్‌ బైక్‌పై వచ్చారు. చిన్నారితో సహా బైక్‌పై ఆ దంపతులు తిరుగు ప్రయాణం కాగా తల్లిదండ్రుల మధ్యలో చిన్నారి ఒదిగి కూర్చుంది. వారు మన్సూరాబాద్‌ నుంచి కామినేని ఆసుపత్రి మార్గంలో వెళ్తుండగా మధ్యాహ్నం 12.30గంటల సమయంలో రోడ్డు పక్కన ఆగిన ఓ కారు డోరును డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ హఠాత్తుగా తెరిచాడు. బైక్‌ కారు డోరును ఢీకొని అదుపుతప్పింది. దీంతో ఆ ముగ్గురూ కింద పడ్డారు.  తల్లిదండ్రులకు స్వల్పగాయాలు కాగా.. ధనలక్ష్మి తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.   కారు డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని