logo

ఏడాదిలో.. మూసీపై కొత్త వంతెనలు

మూసీ నదిపై కొత్త వంతెనల నిర్మాణం మొదలైంది. సన్‌సిటీ-చింతల్‌మెట్‌ వద్ద మొదటి వారధి నిర్మాణ పనులు పట్టాలెక్కాయి. వడివడిగా సాగుతున్నాయి. వారం రోజుల్లో పీర్జాదిగూడ వంతెన నిర్మాణం కూడా పట్టాలెక్కనుంది.

Published : 03 Jun 2023 03:43 IST

నాలుగు అందుబాటులోకి వస్తాయంటున్న ఇంజినీర్లు

సన్‌సిటీ వద్ద పనులు పరిశీలిస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: మూసీ నదిపై కొత్త వంతెనల నిర్మాణం మొదలైంది. సన్‌సిటీ-చింతల్‌మెట్‌ వద్ద మొదటి వారధి నిర్మాణ పనులు పట్టాలెక్కాయి. వడివడిగా సాగుతున్నాయి. వారం రోజుల్లో పీర్జాదిగూడ వంతెన నిర్మాణం కూడా పట్టాలెక్కనుంది. ఇదే వరుసలో ముసారంబాగ్‌, అత్తాపూర్‌ బ్రిడ్జీలు ఉన్నాయి. చాదర్‌ఘాట్‌, అఫ్జల్‌గంజ్‌ వద్ద వంతెన నిర్మాణానికి గుత్తేదారులు ఆసక్తి చూపట్లేదు. దాంతో మరోమారు టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా.. జూన్‌ నెలాఖరు నాటికి నాలుగింటి నిర్మాణం మొదలైనట్లవుతుంది. అవన్నీ ఏడాదిలో పూర్తవుతాయని ఇంజినీర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 15 వారధులు..: మూసీ నదిపై కొత్తగా రూ.545 కోట్లతో 15 వంతెనలు నిర్మించాలని సర్కారు ఏడాది కిందట ఉత్తర్వు జారీ చేసింది.హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండరు ప్రక్రియను ప్రారంభించింది. రూ.12.88కోట్లతో సన్‌సిటీ-చింతల్‌మెట్‌ మధ్య, రూ.40.02కోట్లతో పీర్జాదిగూడ వద్ద మూసీపై వంతెనల నిర్మాణానికి టెండరు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా గుత్తేదారు ఎంపిక ఖరారైంది. ప్రస్తుతం సన్‌సిటీ వద్ద పిల్లర్ల కోసం గుంతలు తవ్వే పనులు జరుగుతున్నాయి. ఇవిగాక బండ్లగూడ జాగీర్‌లోని కిస్మత్‌పూర్‌ రోడ్డును ఐఆర్‌ఆర్‌తో కలిపే హైలెవల్‌ బ్రిడ్జి పనులను హెచ్‌ఆర్‌డీసీఎల్‌ చేపట్టాల్సి ఉంది.

భలే ఖరీదు: ముసారంబాగ్‌, అత్తాపూర్‌ వంతెనలకు రెండుసార్లు ఒకే గుత్తేదారు దరఖాస్తు చేసుకున్నారు. అది కూడా అంచనా వ్యయానికన్నా 7శాతం అదనంగా బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో. ఇక చాదర్‌ఘాట్‌ వంతెనకు మూడోసారి టెండరు పిలిచినా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇవి కాకుండా ఇబ్రహీంబాగ్‌ కాజ్‌వే వద్ద కూడా బల్దియానే బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది.

హెచ్‌ఎండీఏ జాప్యం..: ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ నుంచి మూసీ దక్షిణ ప్రాంతాన్ని కలుపుతూ వంతెన, మంచిరేవుల నుంచి నార్సింగికి, బుద్వేల్‌ ఐటీ పార్కు ఈసా నదిపై, హైదర్‌షాకోట్‌ నుంచి రామ్‌దేవ్‌గూడకు, బుద్వేల్‌ వద్ద రెండోస్థాయి వంతెన, ప్రతాపసింగారం-గౌరెల్లి గ్రామాల మధ్య, మంచిరేవుల వంతెన వద్ద లింకు రోడ్డు మొత్తం ఏడు పనులను హెచ్‌ఎండీఏ చేపట్టాల్సి ఉండగా, ఇంకా టెండరు ప్రక్రియ పూర్తవలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు