logo

Hyderabad: బస్సు నుంచి మంటలు.. పక్కనే పెట్రోల్‌బంకు..

నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడం.. బస్సు ఆగినచోట సరిగ్గా పెట్రోల్‌ బంకు ఉండడం.. సర్వత్రా భయాందోళనలకు దారి తీసిన ఉదంతమిది.

Updated : 03 Jun 2023 07:24 IST

డ్రైవర్‌, బంకు సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

ట్రావెల్స్‌ బస్సు నుంచి ఎగసిపడుతున్న మంటలు

బాలానగర్‌, న్యూస్‌టుడే: నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడం.. బస్సు ఆగినచోట సరిగ్గా పెట్రోల్‌ బంకు ఉండడం.. సర్వత్రా భయాందోళనలకు దారి తీసిన ఉదంతమిది. ప్రమాదాన్ని ఊహించిన డ్రైవర్‌ సహా అందులోని ప్రయాణికులు వెంటనే కిందకి దిగడం.. పెట్రోల్‌బంకు సిబ్బంది అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. బాలానగర్‌ ఠాణా పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సనత్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రం అధికారి ప్రదీప్‌కుమార్‌, పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఆరెంజ్‌ వోల్వో ట్రావెల్స్‌ బస్సులో డ్రైవర్‌ శుక్రవారం సాయత్రం 6 గంటల సమయంలో సుచిత్రా వద్ద నలుగురు ప్రయాణికులతో కూకట్‌పల్లి వైపు బయలుదేరాడు. బాలానగర్‌ ప్రధాన రహదారిలో ఐడీపీఎల్‌ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌బంకు వద్దకు రాగానే బస్సు ఇంజిన్‌ నుంచి వేడి పొగలు వచ్చాయి. డ్రైవర్‌ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారంతా కిందికి దిగారు. అనంతరం డ్రైవర్‌ పారిపోగా ప్రయాణికులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.

బంకు సిబ్బంది అప్రమత్తం: బస్సు నుంచి మంటలు ఎగసిపడడంతో పెట్రోల్‌ బంకు సిబ్బంది అప్రమత్తమయ్యారు. పెట్రోల్‌ పోయడం నిలిపివేసి అక్కడి వాహనదారులను దూరంగా పంపి బంకులోని అగ్నిమాపక సిలిండర్లతో మంటలార్పే ప్రయత్నం చేశారు. సనత్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రానికి చేరవేయగా అక్కడి అగ్నిమాపక అధికారి ప్రదీప్‌కుమార్‌ నేతృత్వంలో రెండు వాహనాలతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. బాలానగర్‌, జీడిమెట్ల నుంచి కూకట్‌పల్లి వైపు వచ్చే వాహనాలు కిలోమీటర్ల దూరం నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రాత్రి 8 గంటల తర్వాత పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చింది. ఎండల తీవ్రతతోనే బస్సు ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారులు గుర్తించారు.

మియాపూర్‌, న్యూస్‌టుడే: మియాపూర్‌లో జాతీయ రహదారిపై శుక్రవారం ఓ ప్రైవేటు బస్సులో మంటలు ఎగసిపడ్డాయి. మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో సకాలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేశారు. వివరాలు.. జాతీయ రహదారిపై సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బీరంగూడ వైపు నుంచి కూకట్‌పల్లి వెళ్తోంది. మదీనగూడ వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు రేగడంతో  డ్రైవర్‌ దాన్ని నిలిపివేశాడు. స్థానికులు కొందరు మంటలు ఆదుపుచేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపుచేశారు. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలంటుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని