logo

రాజధానికి సురక్షణ వలయం

ప్రతి లక్ష మంది జనాభాకు ఒక పోలీస్‌స్టేషన్‌. డయల్‌ 100కు ఫోన్‌కాల్‌ రాగానే సంఘటనా స్థలానికి చేరేందుకు అందుబాటులో పోలీసు బలగం

Published : 04 Jun 2023 03:24 IST

 కొత్త ఠాణాలు, సిబ్బంది పెంపుతో పటిష్ఠ వ్యవస్థ

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రతి లక్ష మంది జనాభాకు ఒక పోలీస్‌స్టేషన్‌. డయల్‌ 100కు ఫోన్‌కాల్‌ రాగానే సంఘటనా స్థలానికి చేరేందుకు అందుబాటులో పోలీసు బలగం. ఫిర్యాదుదారులకు నిత్యం అందుబాటులో సిబ్బంది. అత్యవసర వేళల్లో సన్నద్ధంగా అదనపు బలగాలు. ఇదీ రాజధాని నగర పోలీసింగ్‌. మెగాసిటీ పోలీసింగ్‌లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 22 లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం నుంచి ఫిర్యాదుల స్వీకరణ, కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకూ జనాభా పరిధి అధికంగా ఉన్న ఠాణాలపై భారం తగ్గినట్లయ్యింది. మూడు పోలీసు కమిషనరేట్లలో అదనంగా 3వేల మంది పోలీసులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైతే ఆర్మ్‌డ్‌ విభాగం సేవలు ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా నగరవ్యాప్తంగా ఆదివారం పోలీసులు ‘సురక్ష దినోత్సవం’ నిర్వహించనున్నారు. ప్రజలకు చేరువగా మెగాసిటీ పోలీసింగ్‌ ఉండబోతుందనే విషయాన్ని వినూత్న కార్యక్రమాల ద్వారా చెప్పనున్నారు.

అదనపు బలం.. మహానగరంలో 1.6 కోట్ల జనాభా.. నిత్యం వచ్చిపోయే వారు 40 లక్షల మంది.. జనంతో పోటీపడుతూ 80,70,852 వాహనాలు. జేబుదొంగలు, మాదకద్రవ్యాల రవాణా, అంతరాష్ట్ర ముఠాలతో ఏటేటా 10-15శాతం కేసులు పెరుగుతున్నాయి. నేరపరిశోధన, నిందితుల అరెస్ట్‌లు, న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా చేయటం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ప్రస్తుతం అదనంగా 3000 మంది సిబ్బంది చేరికతో పోలీసు స్టేషన్లకు అదనపు బలం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని