logo

Hyderabad: 100 కి.మీ. వేగం.. 120 కి.మీ. దూరం.. ముఠాను వెంటాడి పట్టుకున్న పోలీసులు

అడ్డదారిన గంజాయి తరలిస్తోన్న అంతర్రాష్ట్ర ముఠాను మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు సినీ ఫక్కీలో ఛేజింగ్‌ చేసి పట్టుకున్నారు. గంటకు 100 కి.మీకుపైగా వేగంతో 2 కార్లలో గంజాయి సరకుతో పారిపోతున్న ముఠాను దాదాపు 120 కి.మీ. దూరం వెంటాడి మరీ అరెస్టు చేశారు.

Updated : 06 Jun 2023 07:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: అడ్డదారిన గంజాయి తరలిస్తోన్న అంతర్రాష్ట్ర ముఠాను మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు సినీ ఫక్కీలో ఛేజింగ్‌ చేసి పట్టుకున్నారు. గంటకు 100 కి.మీకుపైగా వేగంతో 2 కార్లలో గంజాయి సరకుతో పారిపోతున్న ముఠాను దాదాపు 120 కి.మీ. దూరం వెంటాడి మరీ అరెస్టు చేశారు. నగర శివారు యాచారంలో అదుపులోకి తీసుకుని దాదాపు రూ.65 లక్షల విలువైన 220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగుర్ని అరెస్టు చేశారు. మల్కాజిగిరి డీసీపీ డి.జానకి, ఎస్‌వోటీ డీసీపీ గిరిధర్‌, సీఐఎ.రాములు, యాచారం సీఐ లింగయ్యతో కలిసి రాచకొండ సీపీ చౌహాన్‌ సోమవారం కేసు వివరాలు వెల్లడించారు.

అడ్డదారి సంపాదనకు స్మగ్లింగ్‌.. నగరంలోని యాకుత్‌పుర బడాబజార్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ మహ్మద్‌ ఫిరోజ్‌ (44), కార్వాన్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ దినేశ్‌సింగ్‌ (28) స్నేహితులు. గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారు. కొన్నేళ్లుగా ఇద్దరూ తరచూ ఏపీలోని అప్పర్‌ సీలేరుకు చెందిన గంజాయి సరఫరాదారులతో పరిచయాలు పెంచుకుని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గతంలో పట్టుబడి జైలుకెళ్లినా తీరు మారలేదు. ఆర్డర్‌నుబట్టి మహారాష్ట్రలో అమ్ముతోంది. తాజాగా అక్కడి బుల్దానా నగరానికి చెందిన ఠాకూర్‌ నుంచి 220 కిలోల గంజాయి ఆర్డర్‌ వచ్చింది. ఇందుకోసం మహ్మద్‌ ఫిరోజ్‌..మలక్‌పేటకు చెందిన క్యాబ్‌డ్రైవర్‌ మహ్మద్‌ ఖాదర్‌ (28), ఫలక్‌నుమకు చెందిన మెకానిక్‌ అబ్దుల్‌ రవూఫ్‌ (28), కార్వాన్‌కు చెందిన కార్పెంటర్‌ సతీశ్‌ (25)కు కమీషన్ల ఆశ చూపి ఒప్పించాడు. 2 కార్లలో ఐదుగురు సీలేరు వెళ్లి స్థానికుడు ముకుంద్‌ నుంచి 240 కిలోల సరకు కొని మహారాష్ట్రకు బయల్దేరారు. భద్రాచలం, నకిరేకల్‌, పంతంగి టోల్‌ప్లాజా హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర వెళ్లాలన్నది ప్రణాళిక. ఆమేరకు ముందు పైలెట్‌ వాహనం 2 కిలోమీటర్ల వెనుక సరకు నింపిన కారుతో వస్తున్నారు.

పోలీసుల రాకతో సీన్‌ రివర్స్‌.. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర తనిఖీలు జరుగుతున్నాయని తెలుసుకున్న పైలెట్‌ వాహనంలోని ఫిరోజ్‌, దినేశ్‌సింగ్‌.. వెనుక సరకు తీసుకొస్తున్నవారికి సమాచారం ఇవ్వడంతో కార్లు వెనక్కి తిప్పి నల్గొండ, మాల్‌, యాచారం, హైదరాబాదు మీదుగా వెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రాములు బృందం వారిని అనుసరించింది. గమనించిన నిందితులు గంటకు 100 కి.మీ. వేగంతో దూసుకుపోయారు. అంతే వేగంతో వెంటాడిన పోలీసులు యాచారం వద్ద కార్లను అడ్డగించారు. ఫిరోజ్‌, దినేశ్‌ సింగ్‌, ఖాదర్‌, అబ్దుల్‌ రవూఫ్‌, సతీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఠాకూర్‌, ముకుంద్‌ పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని