logo

సదవకాశం.. సద్వినియోగం అవసరం

రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధికి గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో కొందరికి గొర్రెల యూనిట్లను అందజేశారు.

Published : 07 Jun 2023 04:11 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధికి గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో కొందరికి గొర్రెల యూనిట్లను అందజేశారు. ఈనెల 9న రెండో విడతకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మండలాలు, గ్రామాల వారీగా పంపిణీ ప్రణాళికపై పశుసంవర్థక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

12,111 మంది పొందవచ్చు

ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని 2017లో ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 319 గొల్లకుర్మల సంఘాలు ఉన్నాయి. అందులో 22,588 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొదటి విడతలో దశలవారీగా 10,477 మందికి పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్‌కు 20 అడ గొర్రెలు, ఒక పొట్టేలును అందజేశారు. రెండో విడతలో 12,111 మందికి పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. వీరిలో 7,500 మంది డీడీలు చెల్లించారు. జిల్లాకు అవసరమైన గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు పరిశీలిస్తున్నారు.

అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షణ: రెండో విడత గొర్రెల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. లబ్ధిదారుల కుల, ఆధార్‌, బ్యాంకు, నామినీ పత్రాలను సమర్పిస్తున్నారు. ఒకవేళ లబ్ధిదారుడు చనిపోతే నామినీగా ఉన్న భార్య లేదా కుమారులకు అందజేస్తారు. గతంలో మండలస్థాయి అధికారులు పర్యవేక్షణలో గొర్రెల కొనుగోళ్లు జరిగాయి. ఈసారి గతంలో మాదిరిగా కాకుండా జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పారదర్శకత కోసం జీపీఎస్‌ విధానం ఉన్న వాహనాల్లోనే జీవాలను రవాణా చేయనున్నారు.

పెరిగిన యూనిట్‌ ధర

మొదటి విడత సమయంలో గొర్రెల యూనిట్‌ విలువ రూ.1.25 లక్షలు ఉంది. లబ్ధిదారుని వాటా రూ.31,250 కాగా, మిగతా సొమ్మును ప్రభుత్వం భరించింది. ప్రస్తుతం యూనిట్‌ ధర రూ.1.75 లక్షలు అయింది. గతంతో పోలిస్తే రూ.12,500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో నేరుగా జమ చేస్తున్నారు. పలు మండలాల్లో లబ్ధిదారులతో మండల పశు సంవర్థకశాఖ అధికారులు సమావేశమై వాటా చెల్లింపులు ఆన్‌లైన్‌ చేసుకునే విధానం, అందిచాల్సిన ధృవీకరణ పత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు.


ఎంతో ప్రయోజనం

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈనెల 9న ప్రారంభం కానుంది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో గొర్రెలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

డాక్టర్‌ అనిల్‌,జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు