logo

సిరుల మురుగు

ఒక వైపు పర్యావరణాన్ని పరిరక్షించడం.. మరో వైపు మురుగునీటి ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జించడానికి జలమండలి సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసింది.

Published : 07 Jun 2023 04:11 IST

శుద్ధి కేంద్రాల్లో వంటగ్యాస్‌, ఎరువు తయారీకి ప్రణాళిక
మూడు సంస్థలతో జలమండలి ఒప్పందాలు

ఒక వైపు పర్యావరణాన్ని పరిరక్షించడం.. మరో వైపు మురుగునీటి ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జించడానికి జలమండలి సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. నగరంలో రోజువారీ ఉత్పత్తి అయ్యే మురుగునీటిని శుద్ధి చేయడం ఒకటైతే.. ఇదే మురుగునీటిలోని అవశేషాలను వాణిజ్యపరంగా విక్రయించడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ ప్రణాళికకు ఆమోదముద్ర వేయడంతో వీటి అమలుకు జలమండలి వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.

మిథేన్‌ గ్యాస్‌ ఉత్పత్తి..

అంబర్‌పేట, నాగోలు మురుగుశుద్ధి కేంద్రాల్లో ఏటా దాదాపు ఏడువేల క్యూబిక్‌ మీటర్ల మిథేన్‌గ్యాస్‌ ఉత్పత్తి అవుతోందని అధికారులు గుర్తించారు. దీన్ని వంటగ్యాస్‌గా మార్చబోతున్నారు. అంతే కాకుండా ఆటోలకు కూడా ఉపయోగించుకునేలా మార్చబోతున్నట్లు జలమండలి అధికారి ఒకరు తెలిపారు. ఈ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించబోతున్నారు.

ఘనవ్యర్థాల  అమ్మకం

మురుగునీటి శుద్ధి ద్వారా రోజూ 70 మెట్రిక్‌ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని టన్నుకు రూ.560 చొప్పున ప్రస్తుతం విక్రయిస్తున్నారు. మరో 26 మురుగు శుద్ధి కేంద్రాలు వస్తున్న నేపథ్యంలో ఘన వ్యర్థాలను పెద్దఎత్తున సేకరించి వీటిని రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. వీటిని వాడుతున్న చోట్ల పంట ఉత్పత్తులు కూడా పెద్దఎత్తున పెరుగుతున్నాయని గుర్తించారు.

శుద్ధి చేసిన నీరు అమ్మకం

శుద్ధి చేసిన నీటిలో అధిక భాగాన్ని ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌కు తరలిస్తున్నారు. కొంత మొత్తాన్ని అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థలకు కూడా విక్రయించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఎన్సీపీఈ అనే సంస్థ పరిశోధన చేసి జలమండలికి ఒక నివేదికను ఇచ్చింది. ఈ నీటిని నిర్మాణరంగానికి కూడా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. దీని ద్వారా కూడా జలమండలికి ఆదాయం లభించే అవకాశం ఉంది.

కొత్తగా చేపట్టిన మురుగు శుద్ధి కేంద్రాల ద్వారా మిగిలిన నీటిని ఆగస్టు, సెప్టెంబరు నుంచి పూర్తిగా శుద్ధి చేయడానికి జలమండలి ప్రణాళిక రూపొందించింది. మురుగులో నత్రజని అధికంగా ఉంటోంది. దీనివల్ల చెరువుల్లో నాచు, పీచు వంటి పదార్థాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మురుగు నుంచి నత్రజనిని వేరు వేసి దీన్ని ఎరువుగా మార్చి రైతులకు పంపిణీ చేస్తే బాగుంటుందని జలమండలి ఎండీ దానకిశోర్‌ ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ కోసం జలమండలి ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, దిల్లీలోని గోవింద్‌ వల్లభ్‌పంత్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ అనుబంధ సంస్థ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రిసెర్చ్‌తో ఒప్పందం చేసుకుంది.

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి


నగరంలో రోజూ ఉత్పత్తయ్యే మురుగు :1770 మిలియన్‌ లీటర్లు

ప్రస్తుతం శుద్ధి చేస్తోంది 770 మి.లీ.

ఇప్పుడు ఉన్న శుద్ధి కేంద్రాలు 25

కొత్తగా నిర్మిస్తున్నవి 26


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు