logo

చేప ప్రసాదం పంపిణీ నగరానికే గర్వకారణం

ఆస్తమా, ఉబ్బసం రోగులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమం హైదరాబాద్‌కే గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు.

Published : 07 Jun 2023 04:11 IST

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు

అబిడ్స్‌, నాంపల్లి, న్యూస్‌టుడే: ఆస్తమా, ఉబ్బసం రోగులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమం హైదరాబాద్‌కే గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వపరంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కోసం కోట్లాది రూపాయలతో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈనెల 9న ఉదయం 7:30 గంటలకు ప్రారంభించే చేప ప్రసాదం పంపిణీకి జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఇప్పటికే ఎగ్జిబిషన్‌ మైదానానికి చేరుకున్న హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులతో మాట్లాడారు. చేప ప్రసాదం పంపిణీకి గతంలోకంటే ఈసారి అధిక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బత్తిని హరినాత్‌గౌడ్‌ కుటుంబీకులు, వారి వంశస్థులే 250 మంది చేప ప్రసాదం పంపిణీ చేస్తారని చెప్పారు. చేప ప్రసాదం పంపిణీకి ప్రధానంగా అవసరమయ్యే ప్రసాదాన్ని బత్తిని కుటుంబీకులు తయారు చేస్తుండగా, కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చే ప్రజలకు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే ప్రజలను ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భుక్యా, ఆర్‌డీవో వెంకటేశ్వర్లు, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటి, డీసీపీ అశోక్‌కుమార్‌ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌, భారాస గోషామహల్‌ ఇన్‌ఛార్జి నందకిశోర్‌వ్యాస్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని