logo

ప్రభుత్వ నిర్ణయాలతోనే పారిశ్రామికాభివృద్ధి: కేటీఆర్‌

దేశంలోనే మనకంటే పెద్ద నగరాలు దిల్లీ, చైన్నె, ముంబయి, కోల్‌కత్తాతోపాటు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ ఉన్నా అమెజాన్‌, గూగుల్‌, ఆపిల్‌, ఉబర్‌, మైక్రాన్‌, నోవార్టిస్‌ లాంటి అంతర్జాతీయ కంపెనీలు ఆయా నగరాలకు కాకుండా హైదరాబాద్‌కు వచ్చాయంటే ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పారిశ్రామిక అనుకూలమైన నిర్ణయాలు, మెరుగైన మౌలిక వసతులు కారణ’మని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Published : 07 Jun 2023 04:11 IST

పరిశ్రమల శాఖ పదేళ్ల, వార్షిక నివేదికలను విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్‌, చిత్రంలో కేవీఐబీ ఛైర్మన్‌ యూసుఫ్‌, చేనేత శాఖ కార్యదర్శి బుద్దప్రకాష్‌, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లు, టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ జగన్‌మోహన్‌రావు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: దేశంలోనే మనకంటే పెద్ద నగరాలు దిల్లీ, చైన్నె, ముంబయి, కోల్‌కత్తాతోపాటు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ ఉన్నా అమెజాన్‌, గూగుల్‌, ఆపిల్‌, ఉబర్‌, మైక్రాన్‌, నోవార్టిస్‌ లాంటి అంతర్జాతీయ కంపెనీలు ఆయా నగరాలకు కాకుండా హైదరాబాద్‌కు వచ్చాయంటే ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పారిశ్రామిక అనుకూలమైన నిర్ణయాలు, మెరుగైన మౌలిక వసతులు కారణ’మని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రాయదుర్గంలోని టీ-హబ్‌లో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పారిశ్రామిక రంగంలో అధిక పెట్టుబడులు, అధిక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కంపెనీలకు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద సేవా కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కంపెనీలతోపాటు రాష్ట్ర పరిశ్రమల శాఖలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు మంత్రి చేతుల మీదుగా అవార్డులను అందించారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగానికి సంబంధించిన నివేదికను, టెక్స్‌టైల్‌ విభాగం నివేదికను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఒక ప్రభుత్వానికో ఏ రాజకీయ పార్టీకో వత్తాసు పలకాల్సిన పనిలేదు, బాకాలు ఉదాల్సిన అవసరం లేదు.  2025 నాటికి ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ పరిశ్రమ 250 బిలియన్ల డాలర్లు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 2014లో టెక్నాలజీ రంగానికి సంబంధించి తెలంగాణలో 3 లక్షల 23 వేల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 9 లక్షల 5 వేలకు చేరిందని తెలిపారు. తొమ్మిదేళ్లలో ఒక్క రాయదుర్గం ప్రాంతంలోనే 40 మిలియన్ల చదరపు అడుగుల కొత్త కార్యాలయ, వాణిజ్య భవన నిర్మాణం జరిగిందన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వం, శాంతిభద్రతలు, ప్రజా అనుకూలమైన విధానాలు అమలు చేయడం కారణంగా రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళుతోందని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌, ఐఏఎస్‌ అధికారులు విష్ణువర్థన్‌, బుద్ధప్రకాశ్‌, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు బాలమల్లు, ప్రవీణ్‌కుమార్‌, చింతప్రభాకర్‌, సంతప్‌కుమార్‌, యూసఫ్‌జావీద్‌ తదితరులున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు