logo

రియల్టర్ల కన్ను.. ఖద్దరు దన్ను

సాగు చేసుకోండని నాలుగు దశాబ్దాల క్రితం రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూమిపై కొందరు రియల్టర్లు, రాజకీయ నాయకుల కన్ను పడింది.

Updated : 08 Jun 2023 05:04 IST

చేతులు మారుతున్న మదనపల్లి అసైన్డు భూములు
రైతులను బెదిరించి వందల ఎకరాలు స్వాధీనం
చర్యలకు దిగని రెవెన్యూ, పోలీసు అధికారులు

మదనపల్లి అసైన్డ్‌ భూముల్లో అక్రమ లేఅవుట్ల పనులు అడ్డుకుంటున్న రైతులు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, శంషాబాద్‌, న్యూస్‌టుడే: సాగు చేసుకోండని నాలుగు దశాబ్దాల క్రితం రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూమిపై కొందరు రియల్టర్లు, రాజకీయ నాయకుల కన్ను పడింది. ఇప్పటికే 350 ఎకరాలు నయానో భయానో స్వాధీనం చేసుకోగా మిగిలిన మరో 209 ఎకరాలను లాక్కోవడానికి బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా బుధవారం ఇదే భూముల్లో వెంచరు వేస్తుంటే అక్కడి రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

1978లో కేటాయింపు..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం మదనపల్లి గ్రామ పరిధిలోని తండాల్లో నివాసం ఉంటున్న పేద గిరిజనులకు 1978లో 559 ఎకరాలను వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో భూముల రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొన్నాళ్లుగా రైతుల అధీనంలో ఉన్న 350 ఎకరాలను కొంతమంది పేరున్న పెద్దలు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది రైతులకు అంతోఇంతో ఇచ్చి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై శంషాబాద్‌ తహసీల్దారు భూములను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కొంతమంది కీలక నేతలు ఉండటమే కారణమని చెబుతున్నారు. ఇంకా రైతుల దగ్గర 209 ఎకరాల భూమి ఉంది. ఎకరం ఇక్కడ రూ.5 కోట్ల వరకు ఉంటే ఎకరానికి రూ.5 లక్షలు ఆపైన ఇస్తాం... భూమిని తమకు ఇచ్చేయమని బెదిరిస్తున్నారని స్థానికులు తెలిపారు.

వెంచర్‌ వేయడానికి ప్రయత్నాలు

కొంత మంది స్థిరాస్తి వ్యాపారులు బుధవారం మదనపల్లి అసైన్డ్‌ భూముల్లో అక్రమ లేఅవుట్ల పనులకు తెరలేపారు. సమాచారం అందుకున్న రైతులు పనులను అడ్డుకొని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. శంషాబాద్‌ పోలీసులు జోక్యం చేసుకొని రైతులను సముదాయించారు. రియల్‌ వ్యాపారం మాటున అసైన్డ్‌ భూములను కాజేయడానికి యత్నిస్తున్నారన్న ఆరోపణలపై శంషాబాద్‌ వైస్‌ ఎంపీపీ భర్త మోహన్‌నాయక్‌పై శంషాబాద్‌ ఠాణాలో రైతులు ఫిర్యాదు చేశారు.

అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్‌ భూములను కాపాడాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని