logo

ఎల్లమ్మ కల్యాణం వైభవంగా నిర్వహిద్దాం

చారిత్రక బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు.

Published : 08 Jun 2023 02:14 IST

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి తలసాని చిత్రంలో అధికారులు, కార్పొరేటర్లు

సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: చారిత్రక బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. ఈనెల 20న జరిగే కల్యాణం సందర్భంగా దేవాలయం వద్ద బుధవారం ఆయన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈసారి 10 లక్షల వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రద్దీకి తగ్గట్టుగా మంచినీళ్లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు తదితర ఏర్పాటు చేస్తున్నామన్నారు. శివసత్తుల పూజలకు, ఎల్లమ్మను దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నగర నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు ఆలయం వరకు నడిపిస్తామని తెలిపారు. కల్యాణాన్ని వీక్షించేందుకు ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 21న జరిగే రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. బల్కంపేట, అమీర్‌పేట ప్రాంతాల్లో రూ.500కోట్ల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఈవో అన్నపూర్ణ కల్యాణం ఏర్పాట్లను మంత్రికి వివరించారు. అంతకుముందు క్యూలైన్ల ఏర్పాటు పనులు, రుద్రాక్ష మండపాన్ని తలసాని ప్రారంభించారు. సమావేశంలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణ, డీసీపీ జోయల్‌ డేవిస్‌, ట్రాఫిక్‌ డీసీపీ హెగ్డే, హైదరాబాద్‌ జిల్లా వైద్యారోగ్య విభాగం అధికారి డా.వెంకటి, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, డీసీ మోహన్‌రెడ్డి, జలమండలి డైరెక్టర్‌ కృష్ణ, పలు శాఖల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

స్వర్ణశోభితం.. మూలవిరాట్‌ మండపం

సంజీవరెడ్డినగర్‌: స్వర్ణశోభితంగా తీర్చిదిద్దిన బల్కంపేట ఎల్లమ్మ మూలవిరాట్‌ మండపం ఆకట్టుకుంటుంది. ఈ మండపాన్ని మంత్రి తలసాని బుధవారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. దాతల సహకారంతో మండపాన్ని రూ.41.50లక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని