logo

పీహెచ్‌సీకి వచ్చే రోగులు సొంత ఆసుపత్రికి

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో సాధారణంగా నిరుపేదలే ఉంటారు. ఇలాంటి వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన ఓ వైద్యుడు తన సొంత ఆసుపత్రికి పంపించి సొమ్ముచేసుకుంటున్నాడు.

Published : 08 Jun 2023 02:14 IST

ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం

శంషాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రి బోర్డుపై తన పేరు రాసుకున్న ప్రభుత్వ వైద్యుడు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో సాధారణంగా నిరుపేదలే ఉంటారు. ఇలాంటి వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన ఓ వైద్యుడు తన సొంత ఆసుపత్రికి పంపించి సొమ్ముచేసుకుంటున్నాడు. అదేమని అడిగితే ‘‘శంషాబాద్‌లో 15 ఏళ్లుగా ప్రైవేట్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నా. తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం చేస్తే తప్పేముంది’’ అని ప్రశ్నిస్తున్నారు పెద్దషాపూర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి చుక్క ప్రభాకర్‌. శంషాబాద్‌కు చెందిన ఓ ట్రక్కు డ్రైవర్‌ తన కుమార్తె మొదటి కాన్పు నిమిత్తం పెద్దషాపూర్‌  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రభాకర్‌ గర్భిణికి వైద్య పరీక్షలు చేసి శంషాబాద్‌లోని తన సొంత ఆసుపత్రికి రావాలని సూచించాడు. అక్కడికి ఆమెకు సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్డను షాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాడు. సాధారణ ప్రసవం చేశాను.. రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేమని వేడుకుని రూ.15 వేలు ముట్టజెప్పారు. ఇలాంటి పరిస్థితి ఒక్క ట్రక్కు డ్రైవర్‌కే కాదు.. ఎందరిదో..

జిల్లా అధికారికి రాతపూర్వక ఫిర్యాదు..

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవం చేయాల్సిన పెద్దషాపూర్‌ వైద్యాధికారి అమాయక రోగుల నుంచి అందినకాడికి దండుకుని వైద్యం చేస్తున్నాడని బుధవారం స్థానికులు జిల్లా వైద్యాధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం శంషాబాద్‌లో చర్చనీయాంశమైంది. సొంత ఆసుపత్రిలో ప్రసవాలు చేసి పెద్దషాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసినట్లు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఔషధాలను సైతం దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ వైద్యం వద్దు.. ప్రైవేటు వైద్యమే ముద్దు అన్న ధోరణిలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌ చుక్క ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని