logo

యూజీ... పనుల్లో రాజీ!

నగరంలో పలు ప్రాంతాల్లో రహదారులు విస్తరిస్తున్నారు. అక్కడఉన్న ఓవర్‌హెడ్‌ విద్యుత్తు లైన్లను భూగర్భంలోకి మారుస్తున్నారు. ఈ పనులేవీ ప్రమాణాల మేరకు జరగడం లేదు. ముఖ్యంగా 33కేవీ, 11కేవీ పనుల్లో ఎక్కువ అవకతవకలు జరుగుతున్నాయి.

Updated : 08 Jun 2023 05:25 IST

తక్కువకు పనులు  దక్కించుకుని నాణ్యత పట్టించుకోని గుత్తేదారులు
కొత్తగా వేసిన భూగర్భ కేబుళ్లలోనూ సమస్యలు
ఈనాడు, హైదరాబాద్‌

సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తా వద్ద సరిగా తవ్వకుండానే వేస్తున్న కేబుల్‌

నగరంలో పలు ప్రాంతాల్లో రహదారులు విస్తరిస్తున్నారు. అక్కడఉన్న ఓవర్‌హెడ్‌ విద్యుత్తు లైన్లను భూగర్భంలోకి మారుస్తున్నారు. ఈ పనులేవీ ప్రమాణాల మేరకు జరగడం లేదు. ముఖ్యంగా 33కేవీ, 11కేవీ పనుల్లో ఎక్కువ అవకతవకలు జరుగుతున్నాయి.

నగరంలో భూగర్భ కేబుళ్లు వేయడం అంటే ఎన్నో వ్యయ ప్రయాసలు తప్పవు. రహదారి తవ్వకాల అనుమతికే చాలా కాలం వేచిచూడాల్సి వస్తోంది.. ఖర్చు కూడా అధికం. ఈ అవాంతరాలున్నా వీటి వైపే మొగ్గుచూపడానికి కారణం.. సరఫరాలో అంతరాయాలు ఉండవనే. ఓవర్‌హెడ్‌ లైన్లపై. ఎండలు, గాలులు, వానలకు, చెట్ల కొమ్మలు విరిగిపడితే అంతరాయాలు తలెత్తుతుంటాయి. భూగర్భ కేబుళ్లతో ఈ సమస్య ఉండదు. అందుకే ఎక్కడైనా పాత లైన్లను తొలగించినా, ప్రధాన రహదారుల వెంట విస్తరణ పనులు జరిగినా మొదట భూగర్భ(యూజీ) కేబుల్‌ పనులు చేస్తున్నారు.

వినియోగదారుల పనులకు మరోలా..

డిస్కం జారీ చేసే టెండర్లలో పనులు దక్కించుకునేందుకు గుత్తేదారులు తక్కువ కోట్‌ చేస్తుండగా, వినియోగదారుల పనులకు మాత్రం వంద, రెండు వందల శాతం అధికంగా అంచనాలు వేస్తున్నారు. ఇదేమని అడిగితే తగ్గించడానికి బేరసారాలకు దిగుతున్నారు. ఐటీ కారిడార్‌లో, వెంచర్లలో ఎక్కువగా ఈ తరహా దందా నడిపిస్తున్నారు.

మరమ్మతు చాలా కష్టం

తూతూమంత్రంగా చేస్తున్న పనులతో అంతరాయాలు తలెత్తితే వాటి మరమ్మతుల కోసం చాలా శ్రమించాల్సి వస్తోంది. సమస్యను గుర్తించేందుకు యంత్రాలు ఉన్నా, చాలాసార్లు గుర్తించడానికే 24 గంటలు పడుతోంది. కేబుళ్లు ఏ మార్గంలో వెళుతున్నాయనేది డ్రాయింగ్‌లు లేకపోవడంతో స్పష్టత కొరవడి.. ఇష్టారీతిగా రహదారులు తవ్వుతున్నారు.

తక్కువకు వేసి..

భూగర్భ కేబుల్‌ పనులను ప్రమాణాల మేరకు చేపడితే దీర్ఘకాలం మన్నుతాయి. నగరంలో ఎక్కడ ఈ పనులు జరిగినా ముఖ్యంగా 11కేవీ, 33కేవీ కేబుళ్లు మీటర్‌ కంటే తక్కువ ఎత్తులో వేస్తున్నారు. దీంతో ఇతర విభాగాలు రహదారి తవ్వగానే పైన వేసిన భూగర్భ కేబుళ్లు దెబ్బతింటున్నాయి. కేబుళ్ల మధ్య అంతరం ఉండేలా చూడాలి. ఒకదాని మీద ఒకటి పరిచేస్తున్నారు. ఉప్పల్‌ ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఇలాగే ఒకదానిపై ఒకటి పరుస్తున్నారు. గతంలో ట్రాన్స్‌కో సీఎండీ ఈ తరహా పనులపై ఆగ్రహం వ్యక్తంచేసినా.. క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు రాలేదు. గుత్తేదారులు కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు 22 శాతం వరకు తక్కువకు టెండర్‌ వేసి తీరా పనుల విషయంలో ప్రమాణాలు పాటించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని