logo

దొంగ బంగారం దర్జాగా వ్యాపారం!

ధర పెరిగినా.. తగ్గినా వన్నె తరగని గొప్పతనం పసిడి సొంతం. ఇందు కోసమే దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్‌ చేసుకొని పలు ముఠాలు చైన్‌ స్నాచింగ్‌లకు తెగబడుతున్నాయి. నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఏటా రూ.100 కోట్ల విలువైన సొత్తు మాయమవుతోంది.

Updated : 08 Jun 2023 05:02 IST

కేరళ, తమిళనాడు నుంచి భారీగా నగరానికి  చేరవేత

ధర పెరిగినా.. తగ్గినా వన్నె తరగని గొప్పతనం పసిడి సొంతం. ఇందు కోసమే దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్‌ చేసుకొని పలు ముఠాలు చైన్‌ స్నాచింగ్‌లకు తెగబడుతున్నాయి. నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఏటా రూ.100 కోట్ల విలువైన సొత్తు మాయమవుతోంది. దీనిలో 80 శాతం ఆభరణాలే ఉంటాయి. ఇంతటి డిమాండ్‌ ఉన్న బంగారం నగరంలోకి భారీగా స్మగ్లింగ్‌ అవుతోంది. అడ్డదారిలో రోజూ ఇక్కడ 200 కిలోల దొంగ బంగారం చేతులు మారుతుంటుందని అంచనా. దీనిలో ఎక్కువ భాగం కేరళ, తమిళనాడు నుంచి వస్తోంది. ఎక్కడా లెక్కలు చూపని సొత్తు కావడంతో దుకాణాల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు, సిబ్బంది నేరస్థులతో కలిసి మాయం చేస్తున్నారు. బయటపడితే లోగుట్టు తెలుస్తుందనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ఫిర్యాదు చేసేందుకూ ముందుకు రావడం లేదని నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు.

పాత పుత్తడికి డిమాండ్‌..

దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన పుత్తడికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. దొంగలు, స్మగ్లర్ల చేతికి వచ్చిన పసిడి, వెండి ఆభరణాలు రిసీవర్ల చేతికి చేరతాయి. అక్రమ సరకు కావటంతో రూ.లక్ష విలువైన ఆభరణాలకు రూ.30,000-40,000 లోపు ధర చెల్లించి దళారులు దక్కించుకుంటారు. పోలీసులకు చిక్కినా ఆచూకీ దొరక్కుండా ఉండేందుకు ఆభరణాలను కరిగిస్తారు. నాణేలు, బిస్కెట్లుగా మార్చి విక్రయిస్తారు. నగరంలో సికింద్రాబాద్‌, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చార్మినార్‌, బేగంబజార్‌ తదితర ప్రాంతాల్లో కార్ఖానాలున్నాయి. పశ్చిమబెంగాల్‌, యూపీ, రాజస్థాన్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. చిన్నగదిలో సుమారు 10-12 మంది ఎల్పీజీ గ్యాస్‌ సహాయంతో బంగారాన్ని కరిగిస్తుంటారు. వీరిపై అజమాయిషీ చేసేందుకు ఓ వ్యక్తి ఉంటాడు. ప్రమాదమనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు దుకాణాల బయటే పెడతారని, లోపల ఉండవని సికింద్రాబాద్‌కు చెందిన ఓ నగల వ్యాపారి తెలిపారు. భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలంటూ దుకాణాల నిర్వాహకులను పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడేం జరుగుతుందంటే

నిర్దేశించిన బులియన్‌ మార్కెట్‌ ట్రేడర్స్‌ వద్దనే బంగారం కొనుగోలు చేయాలి. ఇక్కడ జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా ఉంటాయి. బిల్లులు, పన్నులతో సంబంధం లేకుండా పసిడిని కరిగించి ముద్దలు, నాణేలు, బిస్కెట్లుగా తయారు చేసి 99.80 శాతం నాణ్యత ఉండే బంగారాన్ని పలు దుకాణాలు కొనుగోలు చేస్తాయి. వాటినే ఆభరణాలుగా తయారు చేస్తుంటారు. వీరే 916హాల్‌మార్కును ముద్రిస్తారు. గతంలో చార్మినార్‌, బేగంబజార్‌లో ఉండే ఈ తరహా వ్యాపారులు ఏడాది కాలంగా సికింద్రాబాద్‌ను అడ్డాగా చేసుకున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే బంగారం వీరి ద్వారానే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు చేతులు మారుతుంటుందని పాట్‌మార్కెట్‌కు చెందిన ఓ వ్యాపారి వివరించారు. ఇలాంటి వారి వల్ల తాము కూడా నష్టపోతున్నామంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి వారికి కొందరు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. బంగారం పట్టుబడినా, చోరీ జరిగినా కేసు నమోదు కాకుండా సొత్తును రికవరీ చేయించుకుంటున్నారు. ఇవే ఆరోపణలతో హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు ఉన్నతాధికారులు ఛార్జిమెమోలు జారీ చేసినట్టు తెలిసింది.

ఇటీవల దొంగల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పసిడి ఆభరణాలు

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని