logo

మెదడులో కల్లోలం!

మెదడులో కణతుల ముప్పు పెరుగుతోంది. కొందరు 30-40 ఏళ్లకే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, పలు ప్రైవేటు ఆసుపత్రులను ఈ రోగులు ఆశ్రయిస్తున్నారు.

Published : 08 Jun 2023 02:14 IST

పెరుగుతున్న కణతుల ముప్పు
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే
బ్రెయిన్‌ ట్యూమర్‌ డే నేడు

ఈనాడు, హైదరాబాద్‌: మెదడులో కణతుల ముప్పు పెరుగుతోంది. కొందరు 30-40 ఏళ్లకే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, పలు ప్రైవేటు ఆసుపత్రులను ఈ రోగులు ఆశ్రయిస్తున్నారు. ఆ ఆసుపత్రుల్లో నిత్యం 30-40 మంది న్యూరో ఓపీ ఉంటోంది. మెదడు కణతులపై అవగాహన లేక చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  ఈనెల 8న ప్రపంచ బ్రెయిన్‌ ట్యూమర్‌ దినం సందర్భంగా కథనం.

శరీరంలో ఏ భాగం పనిచేయాలన్నా మెదడే కీలకం. ప్రతి అవయవాన్నీ మెదడే నియంత్రిస్తుంది.  అయితే బ్రెయిన్‌ ట్యూమర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. దాదాపు 150 రకాల కణతులు మెదడులోని కణజాలాల్లో వచ్చే మార్పుల వల్ల ఏర్పడుతుంటాయి. ఇవి 65 శాతం వరకు క్యాన్సర్ల వల్ల ఏర్పడతాయి. ప్రారంభ దశలో గుర్తించడం చాలా కీలకం. జీవనశైలిలో మార్పు, పొగ తాగడం, మద్యపానంలాంటి అలవాట్లతోపాటు ఒత్తిడి, కుంగుబాటులాంటివి మెదడుపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ లక్షణాలుంటే.. నిద్ర లేచిన తర్వాత ఉదయం తీవ్ర తలనొప్పి, వాంతులు, విరేచనాలు. * దృష్టి సమస్య,  ఒక వస్తువు రెండుగా కన్పించడం,  చూపు కోల్పోవటం. * కాళ్లు, చేతుల కదలికలో తేడా.. కొన్నిసార్లు పూర్తిగా కదిలించలేకపోవడం.* మాటల్లో తడబాటు.. సక్రమంగా మాట్లాడలేకపోవడం. * దైనందిన కార్యకలాపాల్లో గందరగోళం. * వ్యక్తిత్వ, ప్రవర్తన సంబంధిత సమస్యలు. * ఉన్నట్టుండి ఫిట్స్‌ రావటం. * వినికిడి సమస్యలు తలెత్తడం. * శరీరం ఒకవైపు కుంగిపోవడం, పక్షవాతం.

నిర్లక్ష్యం వద్దు: డాక్టర్‌ బ్రహ్మప్రసాద్‌,సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరో సర్జన్‌

మెదడులో కణతి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అన్ని కణతులు క్యాన్సర్లు కావు. అయినా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వెంటనే చికిత్స తీసుకోవాలి. క్యాన్సర్‌ కణుతులైనా మొదటిదశలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. కొందరిలో కణతి ఉన్నా లక్షణాలు కన్పించకపోవచ్చు. దాని స్థానం, పరిమాణం, రకాన్నిబట్టి లక్షణాలు మారతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు