logo

రైల్లో మహిళతో డాక్టర్‌గా పరిచయం..

వైద్యుడిగా మహిళను రైలులో పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు.. ఆమె అమాయకత్వం, ఆరోగ్య సమస్యలను ఆసరాగా చేసుకుని లాడ్జికి తీసుకెళ్లి మత్తు మాత్రలిచ్చి బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌తో ఉడాయించాడు.

Published : 09 Jun 2023 02:10 IST

మత్తు మాత్రలిచ్చి.. గొలుసు, చరవాణితో పరారీ

సీసీ కెమెరాల్లో నిందితుడి చిత్రం

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: వైద్యుడిగా మహిళను రైలులో పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు.. ఆమె అమాయకత్వం, ఆరోగ్య సమస్యలను ఆసరాగా చేసుకుని లాడ్జికి తీసుకెళ్లి మత్తు మాత్రలిచ్చి బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌తో ఉడాయించాడు. గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌ కథనం ప్రకారం... కాకినాడ జిల్లా కొత్తపల్లికి చెందిన మహిళ(50).. భర్త చనిపోవడంతో కూకట్‌పల్లిలోనే నివాసముంటూ టీ దుకాణం పెట్టుకొంది. ఈనెల 2న స్వగ్రామం వెళ్లేందుకు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కింది. పక్కసీటులో కూర్చున్న వ్యక్తి(30).. తాను నిమ్స్‌లో డాక్టర్‌ అని పరిచయం చేసుకున్నాడు. అతనికి ఆమె ఆరోగ్య సమస్యలు తెలిపింది. ఇద్దరూ ఫోన్‌నంబర్లు ఇచ్చుకున్నారు. ఎవరికివారు రైలు దిగి వెళ్లిపోయారు. ఈనెల 6న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు పిఠాపురంలో ఎక్కి.. 7న ఉదయం సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంది. అంతకుముందే ఆమెకు.. నిమ్స్‌ డాక్టర్‌ అని పరిచయం చేసుకున్న వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఆమె స్టేషన్‌కు చేరుకోగానే వచ్చి కలిశాడు. నీ ఆరోగ్య సమస్యకు మందులు తెచ్చానని చెప్పి. రెజిమెంటల్‌బజార్‌లోని ఓ లాడ్జిలో గదికి తీసుకెళ్లాడు. మందుల పేరుతో మత్తు మాత్రలు ఇచ్చి.. ఆమెవద్ద ఉన్న 10 గ్రాముల బంగారు గొలుసు, రూ.5 వేల నగదు, చరవాణి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఆమె నిద్రలేచి చూడగా బ్యాగ్‌లో గొలుసు, నగదు, చరవాణి లేవు. దీంతో బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జిలో గది అద్దెకు తీసుకునేప్పుడు నిందితుడు ఇచ్చిన ఆధార్‌లో చిరునామా తప్పు అని పోలీసులు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు నార్త్‌జోన్‌ డీసీపీ చందనాదీప్తి ఆదేశాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని