logo

మృత్యుపాశాలు

ఊహించినంత పనైంది.. కిందకు వేలాడుతున్న ఇంటర్‌నెట్‌, కేబుల్‌ తీగలకు నిండుప్రాణం బలైంది. ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రికల్‌ లైన్లతో కలిసిపోయి విద్యుదాఘాతాలకు దారితీస్తున్నాయి.

Published : 09 Jun 2023 02:10 IST

విద్యుత్తు స్తంభాలపై ప్రమాదకరంగా కేబుళ్లు

బాగ్‌లింగంపల్లిలో ఇళ్లకు ఆనుకుని వేలాడుతున్న తీగలు

ఈనాడు, హైదరాబాద్‌: ఊహించినంత పనైంది.. కిందకు వేలాడుతున్న ఇంటర్‌నెట్‌, కేబుల్‌ తీగలకు నిండుప్రాణం బలైంది. ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రికల్‌ లైన్లతో కలిసిపోయి విద్యుదాఘాతాలకు దారితీస్తున్నాయి.  ఇష్టారీతిగా కరెంట్‌ స్తంభాలకు కేబుళ్లు లాగుతున్నారు. ఏది విద్యుత్తు తీగో,  ఏది కేబులో తెలియక మృత్యుపాశాలుగా మారుతున్నాయి. మంగళవారం అడ్డగుట్ట సొసైటీలో చిన్నారికి కేబుళ్లు తాకి విద్యుదాఘాతానికి గురైంది. పాపను కాపాడబోయిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రధాన రహదారులు, కాలనీల్లో  కేబుళ్లు వేలాడుతున్నా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టడం లేదు. కేబుల్‌ సంస్థల పేరెత్తితేనే డిస్కం భయపడుతోంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది.
నగరంలో ప్రధాన రహదారుల దగ్గర్నుంచి అంతర్గత దారుల వరకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు చెందిన ఓవర్‌హెడ్‌ విద్యుత్తు తీగలు ఉన్నాయి. ఇందుకోసం సగటున ప్రతి వంద మీటర్లకు ఒక స్తంభం ఉంది. వీటికి ఇప్పుడు కరెంట్‌ తీగలకంటే బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థలు, కేబుల్‌ సంస్థల తీగలే ఎక్కువ కన్పిస్తున్నాయి. ఒకట్రెండు సంస్థలు ప్రత్యేకంగా స్తంభాలు వేసుకోగా.. మిగతావి కరెంట్‌ స్తంభాలపైనే ఆధారపడుతున్నాయి. కొన్ని బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థలకు డిస్కమే అనుమతిచ్చింది. స్తంభానికి నిర్ణీత రుసుం వసూలు చేస్తోంది. అక్రమంగా వాడుకుంటున్న వాటిలో కేబుల్‌ సంస్థలే ఎక్కువగా ఉన్నాయని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. వీటి నియంత్రణకు గతంలో డిస్కం ప్రయత్నించినా.. కేబుల్‌ లాబీయింగ్‌ ముందు చేతులెత్తేసింది.
మరమ్మతులకు తిప్పలే..  కరెంట్‌ స్తంభాల నుంచే ప్రతి ఇంటికి  కనెక్షన్‌ ఇస్తారు. నగరంలో కాబట్టి ప్రతి ఇంట్లో సగటున 4 కనెక్షన్లు ఉంటున్నాయి. ఇలా ఒక స్తంభానికే 20వరకు కనెక్షన్లు ఉంటాయి. కేబుల్‌ తీగలు వీటి చుట్టూనే ఉంటున్నాయి. మరమ్మతుల సమయంలో సర్వీస్‌ తీగ ఏదో గుర్తించలేని పరిస్థితి తలెత్తుతోందని ఆర్టిజన్లు అంటున్నారు.  
వానాకాలంలో...  వేసవి, వర్షాకాలాల్లో సిటీలో తరచూ ఈదురుగాలులు వీస్తుంటాయి. ఆ సమయంలో చెట్లు, కొమ్మలు విరిగి విద్యుత్తు లైన్లపై పడుతుంటాయి. తీగలు తెగి లైన్లు ట్రిప్పవుతుంటాయి. కేబుళ్ల కారణంగా గద్దెలపై నిలబెట్టిన ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలతో పెకిలించేస్తున్నాయి. రెండు స్తంభాలు దెబ్బతినాల్సిన చోట నాలుగైదు పడిపోతున్నాయి. కొన్ని కేబుళ్లు తక్కువ ఎత్తులో ఉండే ఎల్‌టీ విద్యుత్తు లైన్లకు తాకుతున్నాయి. అలాంటపుడు నేల మీద ఉన్నప్పుడు వీటి నుంచి కరెంట్‌ సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కొన్నిచోట్ల వీటి సెట్‌టాప్‌ బాక్స్‌లకు అక్రమంగా కరెంట్‌ వినియోగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి.


తొలగిస్తే దాడికి యత్నిస్తున్నారు

- జె.శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్‌, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌

స్తంభాలపై బ్రాడ్‌బ్యాండ్‌, కేబుల్‌కు చెందిన రెండు రకాల తీగలు ఉన్నాయి. కొన్ని సంస్థలు కమర్షియల్‌ విభాగం నుంచి అనుమతి తీసుకున్నాయి. ఎక్కువగా అనుమతి లేనివే ఉన్నాయి. కేబుల్‌ తీగలను తొలగించే ప్రయత్నం చేస్తే కార్యాలయానికి వచ్చి దాడి చేసేంత పనిచేస్తున్నారు కొందరు. వీటిని నియంత్రించాల్సి ఉంది. లేకపోతే ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. మా పరిధిలో ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించాలని చెబుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని