నిధులకు ఎదురుచూపులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) పనులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
జీహెచ్‌ఎంసీకి రాబడి అంతంతమాత్రమే
ఎస్సార్డీపీ ప్రాజెక్టులు, రెండో దశపై అయోమయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) పనులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అనేక సవాళ్లను ఎదుర్కొని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ ఇప్పటికే 32 ప్రాజెక్టులను పూర్తి చేసింది. సుమారు పది ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. వాటికి భారీగా నిధులు అవసరం. బిల్లుల చెల్లింపులో జీహెచ్‌ఎంసీ జాప్యం చేస్తోందంటూ గుత్తేదారులు ఇప్పటికే పనులను అటకెక్కించారు. ఎస్సార్డీపీ రెండో దశ కింద మరో 36 పనులు ప్రారంభం కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు ద్వారా రూ.10వేల కోట్ల నిధులు ఇస్తేనే.. బల్దియా గట్టెక్కుతుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క ఉక్కు వంతెనే..
* ప్రస్తుతం పది చోట్ల ఎస్సార్డీపీ పనులు నడుస్తుండగా.. ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాసురోడ్డు మీదుగా వీఎస్టీ కూడలి వరకు నిర్మించ తలపెట్టిన ఉక్కువంతెన పనులు మాత్రమే వేగంగా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ఇచ్చిన గడువు సమీపించడంతో.. ఇంజినీర్లు గుత్తేదారును పరుగుతీయిస్తున్నారు.
* ఆర్టీసీ క్రాసురోడ్డుతోపాటు చంచల్‌గూడ జైలు నుంచి ఒవైసీ కూడలి ఆస్పత్రి వరకు నిర్మించ తలపెట్టిన ఉక్కు వంతెన పనులు మాత్రం 30శాతానికి మించలేదు. పెండింగులోని బిల్లులు మంజూరవకపోవడంతో గుత్తేదారు పనులను పూర్తిగా నెమ్మదింపజేశారు. దీంతోపాటు నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతోన్న పనులపై నిధుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
* ఇప్పటికే జీహెచ్‌ఎంసీ బాండ్ల జారీ, బ్యాంకు రుణాలు, సొంత నిధుల నుంచి ఎస్సార్డీపీపై రూ.6వేల కోట్లు వెచ్చించింది. మరో రూ.3వేల కోట్లు వెచ్చిస్తేగానీ పురోగతిలోని పనులు పూర్తవవు. మరోవైపు రూ.4వేల కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకున్న రెండో దశ పనులు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. అందులో రూ.700కోట్ల పనులు జీహెచ్‌ఎంసీ నిధులు చెల్లిస్తే హెచ్‌ఆర్‌డీసీఎల్(హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ) పూర్తి చేయాలనేది ఇరు సంస్థల మధ్య కుదిరిన అవగాహన. నెల జీతాలకు నిధులు సమకూర్చుకు నేందుకు అవస్థలు పడుతోన్న జీహెచ్‌ఎంసీ.. భారీ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.