logo

గ్రేటర్‌కు సొంత వాతావరణ సమాచార వ్యవస్థ

నగరానికి సొంత వాతావరణ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించింది.

Published : 10 Jun 2023 01:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి సొంత వాతావరణ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించింది. దేశంలోని పలు మెట్రో నగరాల మాదిరి.. రాడార్ల నుంచి నేరుగా వాతావరణ సమాచారాన్ని తీసుకునే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జీహెచ్‌ఎంసీలోని విపత్తు స్పందన దళం (డీఆర్‌ఎఫ్‌), ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలతో చర్చలు జరుపుతోంది. ప్రక్రియ పురోగతిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఐఐటీ హైదరాబాద్‌తో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుని, సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని బల్దియా ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఐఎండీ (భారత వాతావరణ శాఖ) వెబ్‌సైట్‌లోని రాడార్‌ చిత్రాల ద్వారా వర్ష సూచనలను తెలుసుకుంటున్నామని, కొన్ని సందర్భాల్లో ఐఎండీ వ్యవస్థ స్పందించకపోవడం, సమాచార లోపాల వంటి గతానుభవాల దృష్ట్యా.. సొంతంగా విపత్తు సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు.

అక్కడే ఉండి పర్యవేక్షించేలా..

అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతరత్రా దుర్ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఘటనాస్థలంలోనే కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి, యంత్రాంగాన్ని సవ్యంగా ఉపయోగించుకునేందుకు మొబైల్‌ కంట్రోల్‌ రూం సమకూర్చుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కంటైనరు వాహనంలో పది మంది అధికారులు కూర్చునే టేబుల్‌, టీవీలు, కంప్యూటర్లు, వైర్లెస్‌ రేడియోలు, కంటైనర్‌పై 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను రికార్డు చేసే వీడియో పరికరం, ఇతరత్రా పరికరాలు ఉంటాయి. మరోవైపు అగ్ని ప్రమాదాల సమయాల్లో మంటల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు ఆరు అంబులెన్సు సేవలను అవసరమైనప్పుడు ఉపయోగించుకునేలా ప్రైవేటు సంస్థతో  బల్దియా ఒప్పందం చేసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని