logo

నకిలీ విత్తనాల రాకెట్‌ గుట్టురట్టు

ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాకెట్లు తయారు చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాల గుట్టును సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు బట్టబయలు చేశారు.

Published : 10 Jun 2023 01:42 IST

10 మంది నిందితుల అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాకెట్లు తయారు చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాల గుట్టును సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్‌వోటీ, మేడ్చల్‌, చేవెళ్ల పోలీసులు వ్యవసాయశాఖతో సంయుక్తంగా సోదాలు నిర్వహించి మూడు గోదాముల్లో సాగుతున్న నకిలీ దందాను గుర్తించారు. 3.35 టన్నుల నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు,  వీటి విలువ రూ.95 లక్షలని అంచనావేశారు. 10 మందిని అరెస్టుచేశారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర శుక్రవారం వివరాలు వెల్లడించారు...

నిర్మల్‌ జిల్లా భైంసా నివాసి అబ్దుల్‌ రజాక్‌(50) పత్తి వ్యాపారి. వ్యాపార భాగస్వాములు జాని, హరీశ్‌ (26), శ్రీనివాస్‌ (40), ఐలయ్య (60), దళారి మల్లిఖార్జున్‌ (36)లతో కలసి దందా సాగిస్తున్నాడు. గుజరాత్‌కు చెందిన కమలేష్‌ పటేల్‌తో రజాక్‌కు పరిచయాలున్నాయి. ఆ రాష్ట్రంలో జన్యుపరీక్షలో విఫలమైన బీజీ3/హెచ్‌టీ పత్తి విత్తనాలను తెలంగాణకు సరఫరా చేసి లాభాలు పొందాలనుకున్నారు. వీరంతా మేడ్చల్‌లో ఉన్న గోదాముకు 2.53 టన్నుల విత్తనాలు చేరవేసి నిల్వచేశారు. ప్రముఖ కంపెనీల ప్యాకెట్లు తయారుచేసి నకిలీ విత్తనాలు నింపారు. రైతులకు విక్రయించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన కొత్త తురకా ఎలీషా అలియాస్‌ బాషా(43) విత్తన వ్యాపారి. కర్నూలులో గౌతమిసీడ్స్‌ డీలర్‌గా ఉన్నాడు. ఏపీ, తెలంగాణల్లోని రైతుల నుంచి ఫౌండేషన్‌ సీడ్స్‌ సేకరిస్తాడు. సాగు సమయంలో అదే రైతులకు ప్రముఖ కంపెనీల పేర్లతో పత్తి విత్తనాలు విక్రయిస్తాడు. సేకరించిన పత్తినుంచి జిన్నింగ్‌ మిల్లుల ద్వారా విత్తనాలు వేరుచేసి నిల్వ చేస్తాడు. జన్యు పరీక్షలో విఫలమైన నిషేధిత విత్తనాలకు వాటిని కలిపి ప్యాకెట్లలో నింపి రైతులను బురిడీ కొట్టిస్తున్నాడు. ఈఏడాది గౌతమీ సీడ్స్‌ నుంచి 5టన్నుల విత్తనాలు కొనుగోలు చేశాడు. వీటిలో జన్యుపరీక్షలో విఫలమైన 800 కిలోల పత్తివిత్తనాలున్నాయి. గోదాములో నిల్వచేశాడు. ప్లాస్టిక్‌/పాలిథీన్‌ ప్యాకెట్‌ తయారీ సంస్థల నిర్వాహకులు వి.రాజు(38), టి.వెంకటేష్‌(53) బోడుప్పల్‌, ఎస్‌.వేణుకుమార్‌(42) సూర్యాపేట జిల్లా, కె.మల్లేష్‌(42)వికారాబాద్‌, బాబూరావు, రోశయ్యలకు డబ్బు ఆశచూపి వివిధ కంపెనీల ప్యాకెట్లను రూపొందించారు. నకిలీ విత్తనాలలు వాటిలో నింపి చేవెళ్ల రైతులకు చేరవేసేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులు దాడిచేశారు. 15 మంది నిందితుల్లో రజాక్‌, మల్లిఖార్జున, శ్రీనివాస్‌, హరీశ్‌, అబ్దుల్‌రఫీ, ఎలీషా, వి.రాజు, టి.వెంకటేష్‌, ఎస్‌.వేణుకుమార్‌, కె.మల్లయ్యలను అరెస్టుచేశారు. పరారీలో ఉన్న ఐలయ్య, జాని, కమలేష్‌పటేల్‌, బాబూరావు, రోశయ్య కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని