అనుమతుల పేరిట అక్రమం!
పాత తాండూరు, నవాంద్గీ, తాండూరు మండలంలోని కాగ్నా నది నుంచి ఇసుక తరలించేందుకు 6-10 ట్రిప్పులకు మాత్రమే రూ.600 చొప్పున డీడీ చెల్లించి అనుమతి పొందుతున్నారు.
ఇష్టానుసారం ఇసుక తరలింపు
అడ్డుకుంటే దాడులు
న్యూస్‌టుడే, పాత తాండూరు, బషీరాబాద్, తాండూరు గ్రామీణ
* పాత తాండూరు, నవాంద్గీ, తాండూరు మండలంలోని కాగ్నా నది నుంచి ఇసుక తరలించేందుకు 6-10 ట్రిప్పులకు మాత్రమే రూ.600 చొప్పున డీడీ చెల్లించి అనుమతి పొందుతున్నారు. 2 నుంచి 5 ట్రాక్టర్లు నదికి పంపించి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు అనుమతుల పేరిట అక్రమంగా తరలిస్తున్నారు.
* బషీరాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి 50 ట్రిప్పుల ఇసుక అవసరం ఉంటే కేవలం పదింటికి అనుమతి తీసుకుని ఐదు ట్రాక్టర్లతో నవాంద్గీ నది నుంచి రెండు రోజుల పాటు తరలించారు.
* పాత తాండూరులో గురువారం రాత్రి ఇసుక తరలింపునకు అనుమతి చూపించాలని, జన సంచారంలో నుంచి వెళ్లే సమయంలో ట్రాక్టర్లు నిదానంగా నడిపించాలని చెప్పినందుకు వీఆర్‌ఏపై దాడి చేశారు.
* బషీరాబాద్ మండలంలో మూడు నెలల కిందట ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులను ట్రాక్టర్త్‌ో ఢీకొట్టారు.
అనుమతుల పేరిట ఇసుకాసురులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అనుమతులు తీసుకున్న దానికి నాలుగింతల ఇసుకను వాగు నుంచి తోడేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇసుక తరలించే వాగులు, నది వద్ద రెవెన్యూ అధికారులెవరూ లేకపోవడంతో వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అనుమతులెన్ని? ఇప్పటికి ఎన్ని తరలించారని గ్రామస్థులు అడిగితే వారిని బెదిరిస్తూ , దాడులకు పాల్పడుతున్నారు. అధికారులు, పోలీసులు నిఘా పెంచితేనే ఈ దందాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. కాగ్నా నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దర్జాగా అక్రమ రవాణా కానిచ్చేస్తున్నారు. ఇరుకైన వీధులు, కాలనీల్లోని రహదారుల్లో రయ్‌మంటూ వాహనాలను వేగంగా పోనిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి.
వాగులు, కాల్వల్లో..: సామాన్య ప్రజలకు, ప్రభుత్వ పనులకు ఇసుక కష్టాలు ఉండొద్దనే ఉద్దేశంతో కలెక్టర్ నారాయణరెడ్డి చొరవ తీసుకుని రూ.600కే ట్రాక్టరు ఇసుక ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో స్థానికంగా ఉన్న వాగులు, కాల్వల్లో ఉన్న ఇసుక తరలించుకోవచ్చని సూచించారు. ప్రధానంగా తాండూరు, పాత తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, తాండూరు మండలాల పరిధిలో కాగ్నానది పరీవాహకం ఉంది. ఇసుక మేటలు అధికం. చౌకకే ఇసుక వస్తున్నప్పటికీ ఎక్కువ అవసరమైన వారు ఎక్కువ ట్రాక్టర్లు పెట్టుకుని రోజుకు ఒకటి, రెండు ట్రిప్పుల అనుమతులతో 12 ట్రిప్పుల వరకు తరలిస్తున్నారు.
వే బిల్లులు లేకుండానే...
గతంలో వాగు వద్ద వీఆర్‌ఏ వేబిల్లు ఇచ్చేవారు. ఇసుక లోడ్ చేసిన సమయం, వెళ్లే మార్గం, పట్టే సమయాన్ని నిర్దేశించి వీఆర్‌ఏ సంతకం చేసి ట్రాక్టరుతో వేబిల్లు పంపించేవారు. మరో ట్రిప్పునకు వాగుకు వస్తే పాత వేబిల్లు ఇస్తేనే మళ్లీ కొత్తది ఇచ్చాకే అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం కేవలం ప్రొసిడింగ్ మాత్రమే ఇస్తున్నారు.
అక్రమంగా తరలిస్తే ట్రాక్టర్లు జప్తు
-వెంకటస్వామి, తహసీల్దార్, బషీరాబాద్
ఇసుక అవసరం ఉన్నవారు అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతులు తక్కువ తీసుకొని ఎక్కువ తరలించే వారిపై నిఘా పెట్టించి జప్తు చేసి పోలీసులకు అప్పగిస్తాం. ఇసుక అక్రమ రవాణా జరిగితే సమాచారం అందించాలి. అర్జీ పెట్టుకున్న వెంటనే అనుమతులిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.