KTR: ఈ-గవర్నెన్స్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌: మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో సుపరిపాలన కూడా రావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దేశంలోనే తెలంగాణ ఈ-గవర్నెన్స్‌లో ప్రథమ స్థానంలో ఉందన్నారు.

Updated : 10 Jun 2023 16:33 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను కలవటం లేదని, ప్రజా దర్బార్‌ నిర్వహించటం లేదని కొంతమంది చేస్తోన్న విమర్శలకు పురపాలక శాఖ మంత్రి బదులిచ్చారు. ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే సమస్య తన వరకు వస్తుందని సీఎం అన్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చి, పాలనను ప్రజల వద్దకు చేర్చారని తెలిపారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జీహెచ్‌ఎంసీ వార్డు అధికారులకు నిర్వహించిన ‘వార్డు ఆఫీసర్స్ ఓరియెంటేషన్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

కేసీఆర్‌ ప్రజా దర్బార్‌ ఎందుకు నిర్వహించడం లేదని కొందరంటున్నారని కేసీఆర్‌తో చెబితే.. ‘‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి మొదలుకొని కిందిస్థాయిలో పనిచేసే ఉద్యోగి వరకు ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సామాన్య వ్యక్తి పింఛను, రేషన్‌ కార్డు, నల్లా కోసమో, పాస్‌బుక్‌లో పేరు ఎక్కట్లలేదనో సీఎంకు చెప్పుకొనే పరిస్థితి వచ్చిందంటే వ్యవస్థలోనే ఏదో లోపం ఉంది. యంత్రాంగం సరిగా పని చేయడంలేదని నాకు అర్థమవుతోంది. సామాన్యులకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలి. వీరితో నెరవేరని సమస్యలు, జఠిలమైనవి ఏమన్నా ఉంటే సీఎం వరకు రావాలి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎవరి స్థాయిలో వాళ్లు ఉండి పనిచేస్తే సీఎం దాకా రావాల్సిన అవసరం లేదన్నారు’’ అని కేటీఆర్‌ తెలిపారు.

సిటిజన్ చార్టర్‌ను ఏర్పాటు చేస్తాం..

రాష్ట్రంలో సుపరిపాలన కూడా రావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దేశంలోనే తెలంగాణ ఈ-గవర్నెన్స్‌లో ప్రథమ స్థానంలో ఉందన్నారు. వార్డు కార్యాలయానికి సంబంధించిన సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ప్రజలకు ఇస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన పట్టణ ప్రగతి దినోత్సవం రోజున 150 ప్రాంతాల్లో ఒకేసారి వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని తెలిపారు. వార్డు అధికారుల జాబ్‌ చార్ట్‌తోపాటు పౌరుల ఫిర్యాదులను ఎంతకాలంలో పరిష్కరిస్తామో చెప్పే సిటిజన్ చార్టర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి వార్డు కార్యాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని ఇదే ప్రథమమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ రంజిత్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని