ఉచితమని చిన్నచూపు
మెట్రో పార్కింగ్ స్థలాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. వర్షం పడితే అడుగుపెట్టలేని స్థితిలో యార్డులు ఉంటున్నాయి. వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుతున్నా పట్టించుకొనేవారు లేరు.
అధ్వానంగా మెట్రో పార్కింగ్ సేవలు
ఫిర్యాదులపై స్పందించని యంత్రాంగం
ఈనాడు, హైదరాబాద్
మెట్రో పార్కింగ్ స్థలాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. వర్షం పడితే అడుగుపెట్టలేని స్థితిలో యార్డులు ఉంటున్నాయి. వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుతున్నా పట్టించుకొనేవారు లేరు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మెట్రో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలు ఉచితమనే చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రోరైలు కోసం మూడు కారిడార్లలోని స్టేషన్ల చేరువలో ప్రభుత్వం ఎల్‌అండ్‌టీకి స్థలాలు కేటాయించింది. నాలుగుచోట్ల మాత్రమే మెట్రో మాల్స్ నిర్మించారు. అక్కడ ప్రయాణికులకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. మొన్నటి వరకు ఉచితంగా అవకాశం కల్పించినా.. కొద్ది రోజులుగా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం మొదలెట్టారు. వీరికి కేటాయించిన మిగతా ఖాళీ స్థలాల్లో సైతం పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇక్కడ ప్రస్తుతానికి ఉచితంగా వాహనాలు నిలుపుతున్నారు.
వాన పడితే బురదే..
వర్షం పడితే చాలు పార్కింగ్ స్థలాలు బురదమయం అవుతున్నాయి. నేల చదునుగా లేకపోవడంతో గతుకుల్లో నీరు నిలుస్తోంది. మియాపూర్ డిపో పక్కన విశాలమైన స్థలంలో వాహనాలు నిలుపుకోవడానికి అనుమతిచ్చారు. స్థలం ఎత్తుపల్లాలుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. వాన, ఎండ నుంచి రక్షణగా షెడ్లు నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. పార్కింగ్ స్థలాలు చాలా విశాలంగా ఉన్నాయి. ఎన్ని వాహనాలైనా నిలపొచ్చు. మార్కింగ్ లేకఎవరికివారు ఇష్టం వచ్చినట్లు నిలుపుతున్నారు. తొందరగా వెళ్లాలనే ఆలోచనతో గేటు దగ్గరలో వాహనం వెనకే మరోటి పెడుతున్నారు. దారి కూడా వదలడం లేదు. నాగోల్ స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కేంద్రంలో ముందుగా నిలిపిన వాహనాలు బయటకు తీయాలంటే సాహసం చేయాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.