logo

కుళ్లిన మాంసం.. అవుతోంది కీమా

ఉదయాన్నే తాజా మాంసంతో తయారు చేసిన కీమా తిందామని తిరుమలగిరికి చెందిన ఓ కుటుంబం సికింద్రాబాద్‌లోని ప్రముఖ హోటల్‌కు వెళ్లింది.

Updated : 20 Sep 2023 08:31 IST

జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతో ప్రమాదం బారిన ప్రజారోగ్యం
ఈనాడు, హైదరాబాద్‌

దయాన్నే తాజా మాంసంతో తయారు చేసిన కీమా తిందామని తిరుమలగిరికి చెందిన ఓ కుటుంబం సికింద్రాబాద్‌లోని ప్రముఖ హోటల్‌కు వెళ్లింది. సిబ్బందికి చెప్పగానే వేడి వేడి కీమాను గిన్నెల్లో వడ్డించారు. ఆ కుటుంబం తినగా.. తేడా కొట్టింది. ముద్దను నమలగానే.. పాచిపోయిన వాసనొచ్చింది. వెంటనే వాళ్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. హోటల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా మాత్రం స్పందించలేదు. నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కుళ్లిన మాంసాన్ని వంటల్లో ఉపయోగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆహారకల్తీ నియంత్రణ అధికారుల ఉదాసీన వైఖరి వల్లే కల్తీ ఆహారం విస్తరిస్తోంది.


సామాన్యులు ఏమైతేనేం..

గర మేయర్‌, అదనపు కమిషనర్‌, ఎమ్మెల్యే, ఇతరత్రా నేతలు ఆహార కల్తీపై చేసే ఫిర్యాదులే జీహెచ్‌ఎంసీ చెవిన పడుతున్నాయి. సామాన్య పౌరులు బల్దియా కాల్‌సెంటరుకు ఆహార కల్తీపై ఫిర్యాదు చేస్తే స్పందన ఉండదు. వినియోగదారుల ఆందోళనను, ప్రజారోగ్యాన్ని అధికారులు ఖాతరు చేయడంలేదు.  


ఆదేశిస్తేనే తనిఖీలు

  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌లో కుళ్లిన మాంసంతో వంటలు తయారు చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా జీహెచ్‌ఎంసీకి ఐదు రోజుల క్రితం ఫిర్యాదు చేరింది. అధికారులు పట్టించుకోలేదు. ఆరోగ్య విభాగం అదనపు కమిషనర్‌ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేశాకే.. అధికారులు హోటల్‌ను తనిఖీ చేసి సీజ్‌ చేశారు.  
  • వారం క్రితం శేరిలింగంపల్లి జోన్‌లోని సాంక్టా మారియా ఇంటర్నేషనల్‌ స్కూలు క్యాంటీన్‌పై బల్దియాకు ఫిర్యాదు అందింది. అధికారులు స్పందించలేదు. మరుసటి రోజు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధికారులను వివరణ కోరడంతో.. అధికారుల బృందం పాఠశాల వంటగదిని తనిఖీ చేసింది. వంటగదికి తాళం వేసి, సేకరించిన నమూనాలను ప్రయోగశాలకు పంపారు.

అధ్వానంగా వంటగదులు..

గరంలోని ప్రముఖ హోటళ్ల నుంచి రోడ్లపై నడిచే తోపుడు బండ్ల వరకు.. దాదాపు సగం యజమానులు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. నాసిరకం టమాటా, చిల్లీ సాస్‌లు, రసాయనాలతో తయారైన అల్లం-వెల్లుల్లి ముద్ద, రంపపు పొట్టుతో తయారైన పసుపు, కషాయాన్ని తలపించే కారం పొడి, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లో ముంచిన యాలకులు, లవంగాల వంటి మసాలా దినుసులను వంటగదికి తీసుకెళ్తున్నారు. కిలోలకొద్దీ కొనుగోలు చేసిన మాంసాన్ని రోజుల తరబడి రిఫ్రిజిరేటర్లలో భద్రపరుస్తున్నారు. కూరలు, చెట్నీలు రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో ప్రత్యేక వంటల పేరుతో.. దాచిపెట్టిన బిర్యానీ వంటకాలను ఓవెన్‌లో వేడి చేసి వడ్డిస్తున్నారు. వాటిని ఆరగించిన వారు జ్వరం, వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు. కల్తీ, పాచిపోయిన ఆహారంతో దీర్ఘకాలంలో ప్రజారోగ్యంపై మరింత ప్రభావం చూపనుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు