logo

Crime News: కుమార్తె వరసయ్యే యువతితో ప్రేమాయణం

కుమార్తె వరసయ్యే యువతితో అనైతిక సంబంధం నెరిపిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువతి తండ్రి.. మరో నలుగురితో కలిసి ఈ హత్య చేయించాడు.

Updated : 20 Sep 2023 08:03 IST

మరో నలుగురితో కలిసి యువకుడిని హత్య చేసిన తండ్రి

షాద్‌నగర్‌పట్టణం, కేశంపేట, న్యూస్‌టుడే: కుమార్తె వరసయ్యే యువతితో అనైతిక సంబంధం నెరిపిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువతి తండ్రి.. మరో నలుగురితో కలిసి ఈ హత్య చేయించాడు. గత నెల 15న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో యువకుడిని హత్య చేసి పరారైన నిందితులు నెల అనంతరం ఓ మహిళతో ఫోన్‌ మాట్లాడి పోలీసులకు చిక్కారు. షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామి, రూరల్‌ సీఐ లక్ష్మీరెడ్డితో కలిసి శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి మంగళవారం షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు.

బిహార్‌కు చెందిన కరణ్‌కుమార్‌ (18) రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెళ్లిలో ఓ కోళ్ల ఫారంలో కూలీపనులు చేస్తుంటాడు. అదే రాష్ట్రానికి చెందిన రంజిత్‌కుమార్‌ కుటుంబం సహా నిర్దవెల్లికి ఉపాధి కోసం వచ్చి స్థానిక కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. కరణ్‌కుమార్‌, రంజిత్‌కుమార్‌ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఇద్దరూ వరుసకు సోదరులు. వావివరసలు మరిచి కరణ్‌కుమార్‌ రంజిత్‌కుమార్‌ కూతుర్ని ప్రేమించాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. విషయం తెలుసుకున్న రంజిత్‌.. కరణ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. నీకు కూడా కూతురే అవుతుందని చెప్పాడు. కరణ్‌ ఇవేవీ పట్టించుకోలేదు. కొద్దిరోజుల పాటు యువతిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. దీంతో రంజిత్‌ గట్టిగా బెదిరించాడు. అనంతరం కరణ్‌ సిద్ధిపేటకు వెళ్లి పనిలో కుదిరాడు. అక్కడికెళ్లినా అతనిలో మార్పురాలేదు. ఆమెతో తనకు వివాహమైందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. యువతి నుదుట కుంకుమ పెట్టిన ఫోటోలు పోస్టు చేసేవాడు. విసిగిపోయిన రంజిత్‌.. కరణ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తనకు పరిచయస్తులైన బిహార్‌కు చెందిన ముంతోష్‌కుమార్‌, బబ్లూ, మరో ఇద్దరు మైనర్ల సాయం కోరాడు.

పని ఉందని పిలిపించి..

రంజిత్‌ పథకం ప్రకారం ఆగస్టు 15న కరణ్‌కు ఫోన్‌ చేశాడు. పొలంలో పనిఉంది రమ్మని చెప్పి పిలిపించి నిర్దవెల్లి-జూలపల్లి మధ్య రహదారి పక్కకు తీసుకెళ్లాడు. అక్కడే బురద నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. అక్కడే పాతిపెట్టి పరారయ్యారు. తన తమ్ముడు కనిపించడం లేదంటూ కరణ్‌ అన్న దీపక్‌ గత నెల 29న కేశంపేట పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వారు కేసు నమోదు చేసి కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. చివరిసారిగా రంజిత్‌ కాల్‌ చేయడం, కరణ్‌ ఫోన్‌ సిగ్నల్‌ నిర్దవెల్లి మధ్య ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాల మేరకు రంజిత్‌ హత్య చేసినట్లు రుజువైంది. ఈలోపే నిందితులు ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. ఫోన్లు స్విచాఫ్‌ చేయడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టమైంది. ఈ సమయంలోనే నిందితుల్లో ఒకరు యువతికి కాల్‌ చేసి స్విచాఫ్‌ చేశారు. ఈ సమాచారం అందుకున్న కేశంపేట ఎస్సై వరప్రసాద్‌, కానిస్టేబుల్‌ శివ ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో నిందితులు తలదాచుకున్నట్లు గుర్తించారు. అక్కడికెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితుల్ని రిమాండుకు.. ఇద్దరు మైనర్లను జువైనల్‌ హోంకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని