logo

ఇరుకు గదుల్లో పోలింగ్‌ కేంద్రాలా?

ఇరుకు గదుల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండడంపై అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 20 Sep 2023 02:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇరుకు గదుల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండడంపై అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ప్రతిసారి ఓటర్లకు అసౌకర్యం కలుగుతోందన్నారు. ఓటరు జాబితా సవరణపై మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, ఆప్‌ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని.. ఓటరు సవరణ పేరుతో ఓట్లను ఇష్టానుసారం రద్దు చేస్తున్నారని, నోటీసుల్లేకుండా పేర్లను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్వాన్‌, మలక్‌పేట, గోషామహల్‌ ఎమ్మెల్యేలు కౌసర్‌ మొయినుద్దీన్‌, బలాలా, రాజాసింగ్‌ మాట్లాడుతూ ఓటరు జాబితాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా పరిశీలకులు డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ మాట్లాడారు. ‘‘తప్పుల్లేని ఓటరు జాబితాను సాకారం చేసేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు సహకరించాలి. మా పరిధిలో బూత్‌స్థాయి అధికారులను నియమించాం. వారి ద్వారా ఓటరు నమోదు, సవరణ, తొలగింపు దరఖాస్తులను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం విచారిస్తున్నాం. సవ్యంగా ఉన్న దరఖాస్తులనే ఆమోదిస్తున్నాం.’’అని వివరించారు. హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌, కలెక్టర్‌ అనుదీప్‌, ఎన్నికల విభాగం అదనపు కమిషనర్‌ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు