logo

Crime News : డ్రగ్స్‌ దందాలో విదేశీ సిమ్‌కార్డులు.. కోడ్‌ పదాలు!

గోవా.. ముంబయి నుంచి బెంగళూరు మకాం మార్చిన నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. మత్తుపదార్థాల సరఫరాలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాయి.

Updated : 20 Sep 2023 07:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: గోవా.. ముంబయి నుంచి బెంగళూరు మకాం మార్చిన నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. మత్తుపదార్థాల సరఫరాలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాయి. పోలీసులకు పట్టుబడకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ పెడ్లర్స్‌ తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోకి చేరుతున్న సింథటిక్‌ డ్రగ్స్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు టీఎస్‌న్యాబ్‌ డైరెక్టర్‌, నగర సీపీ సీవీ ఆనంద్‌ సారథ్యంలో పలు బృందాలు అంతరాష్ట్ర ముఠాలు, నైజీరియన్ల కోసం వేటసాగిస్తున్నారు. గత నెల 31న మాదాపూర్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్‌లో రేవ్‌పార్టీలతో బయటపడిన మత్తుదందాతో టాలీవుడ్‌ లింకులు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. అప్పుడు అరెస్టయిన బాలాజీ, వెంకటరత్నారెడ్డి సెల్‌ఫోన్లలోని నంబర్లు, వాంగ్మూలం ఆధారంగా సినీ, రాజకీయ ప్రముఖులతో లింకులు బయటపడ్డాయి. దీని ఆధారంగా తాజాగా ముగ్గురు నైజీరియన్లతో సహా 8 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

బకరా.. కోక్‌.. డెడ్‌డ్రాప్‌ అంతే బ్రో: డ్రగ్స్‌ దందాలోని నైజీరియన్లు బెంగళూరు చేరగానే నకిలీ పాస్‌పోర్టు, వీసాలు తయారు చేయిస్తారు. వాటి ద్వారా అక్కడ ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు.  తమ దేశపు సిమ్‌కార్డులను ఉపయోగించి వైఫై వాట్సాప్‌, షేర్‌ఛాట్‌ ద్వారా పెడ్లర్స్‌, ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. సంభాషణలు, ఛాటింగ్స్‌ ఎన్‌క్రిప్ట్‌లో ఉండటంతో పోలీసులు గుర్తించలేకపోతు న్నారు. సరకు ఆర్డర్‌కు  బకరా.. కోక్‌.. శాండిల్‌ వంటి కోడ్‌ భాష ఉపయోగిస్తున్నారు. నగదు చేతిలో పడ్డాక మాత్రమే సరకు ఎక్కడ తీసుకోవాలనేది చెబుతారు. నిర్దేశించిన ప్రదేశాల్లో కిరాణా, పాన్‌, పాల దుకాణాల వద్ద డ్రగ్స్‌ ప్యాకెట్లు అందజేస్తారు. దీనికి ప్రతిఫలంగా దుకాణదారులకు కొంత కమీషన్‌ ఇస్తారు. కొన్ని ముఠాలు నిర్మానుష్య/చీకటి ప్రదేశా(డెడ్‌డ్రాప్‌)ల్లో పొట్లాలు ఉంచి దూరంగా ఉండి గమనిస్తారు. ఇరువైపుల లావాదేవీలు పూర్తయినట్టు ధ్రువీకరించేందుకు ‘బ్రో’ అనే సంకేతం ఉపయోగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు.


విశాఖపట్నంతో లింకులు

మాదాపూర్‌లో బయటపడిన మత్తుదందాతో విశాఖపట్నానికి లింకులు బయటపడ్డాయి. ఈవెంట్ మేనేజర్‌ కలహర్‌రెడ్డి, సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాము అలియాస్‌ రాంచందర్‌ ఆధ్వర్యంలో విశాఖలోనూ రేవ్‌పార్టీలు నిర్వహించేవారు. మోడల్స్‌, సినీ తారల(సహనటులు)ను ఆకర్షణగా ఉంచేవారు. స్థానికంగా కొందరు రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులూ పార్టీలకు హాజరైనట్లు భావిస్తున్నారు. నిందితుల కాల్‌డేటాలో విశాఖ, గుంటూరు, నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులు కొందరి పేర్లు ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని