logo

అనారోగ్యంతో కెప్టెన్‌ రామారావు కన్నుమూత

భారత నౌకాదళ విశ్రాంత అధికారి, ఫోరం ఫర్‌ ఎ బెటర్‌ హైదరాబాద్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కెప్టెన్‌ జె.రామారావు(94) మంగళవారం ఉదయం అనారోగ్యంతో బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని స్వగృహంలో కన్నుమూశారు.

Published : 20 Sep 2023 02:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారత నౌకాదళ విశ్రాంత అధికారి, ఫోరం ఫర్‌ ఎ బెటర్‌ హైదరాబాద్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కెప్టెన్‌ జె.రామారావు(94) మంగళవారం ఉదయం అనారోగ్యంతో బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని స్వగృహంలో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం జలగం వెంగళరావుకు సోదరుడు అయిన రామారావు స్వస్థలం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి. 1929లో జన్మించారు. చెన్నైలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి 1953లో ఇండియన్‌ నేవీలో చేరారు. నౌకాదళంలో ఆయన అందించిన సేవలకు విశిష్ట సేవా పతకం(వీఎస్‌ఎం) పొందారు. 1975లో కెప్టెన్‌ ర్యాంకులో పదవీవిరమణ చేశారు. అనంతరం సుస్థిర అభివృద్ధి, వనరుల పరిరక్షణ ధ్యేయంగా సామాజిక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఫోరం ఫర్‌ ఎ బెటర్‌ హైదరాబాద్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన మూడేళ్లు ఆ సంస్థకు ఛైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో ఇంధన వనరులు, అడవులు, పర్యావరణం, వన్యప్రాణులు, జలవనరుల పరిరక్షణ ఆవశ్యకతపై విలువైన సూచనలు, సలహాలు అందించారు. వయోభారం, అనారోగ్యంతో కొన్నాళ్లుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆయన మృతి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పర్యావరణ వేత్తలకు తీరని లోటు అని ఫోరం ఫర్‌ ఎ బెటర్‌ హైదరాబాద్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వేదకుమార్‌ అన్నారు. ఈ సంస్థతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని