logo

వినాయకచవితి వేడుకల్లో అపశ్రుతి

వినాయకచవితి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకొంది. వేర్వేరుచోట్ల విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం..

Published : 20 Sep 2023 02:17 IST

విద్యుదాఘాతానికి గురై ఇద్దరి మృతి

జూబ్లీహిల్స్‌, షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: వినాయకచవితి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకొంది. వేర్వేరుచోట్ల విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. సోమాజీగూడ బీఎస్‌మక్తాలో సిద్ధి వినాయక యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు ఈనెల 17న వినాయకమండపాన్ని ఏర్పాటుచేస్తున్నారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో విద్యార్థి దాసరితేజ(21), ప్రైవేటు ఉద్యోగి వి.హనుమ(26)లు ఒక ఐరన్‌ ఫ్రేమ్‌ పట్టుకున్నారు. ఫ్రేమ్‌ చివరి భాగం.. పక్కనేఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. అటుగా వచ్చిన విశ్వనాథ్‌ అనే వ్యక్తి గమనించి, స్థానికుల సాయంతో విద్యుత్తు సరఫరా నిలిపేశాడు. అప్పటికే హనుమ అచేతనంగా పడిఉన్నాడు. తేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ యశోద ఆసుపత్రికి తరలించగా హనుమ పరిస్థితి విషమించి మృతిచెందాడు. తేజకు చికిత్స చేస్తున్నారు. హనుమ సోదరుడు గోపి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటన వివరాలు జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్‌ కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన గాండ్ల మల్లేష్‌(30).. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి గాజులరామారం మహదేవపురంలోని తత్వ అపార్ట్‌మెంట్‌లో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం ప్రహరీపైకి ఎక్కి మామిడి తోరణాలు కడుతున్నాడు. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నియంత్రిక వైరును తాకడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు, అపార్టుమెంట్‌వాసులు అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించి కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని