logo

హామీలతో మభ్యపెడుతున్న ప్రధాన పార్టీలు

దేశంలో, ఇటు రాష్ట్రంలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టే హామీలు ఇస్తున్నాయని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌, కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేర్కొన్నారు.

Published : 20 Sep 2023 02:17 IST

కటకం మృత్యుంజయం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: దేశంలో, ఇటు రాష్ట్రంలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టే హామీలు ఇస్తున్నాయని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌, కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేర్కొన్నారు. ప్రజల అవసరాలేంటో తెలుసుకోరు, ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయడంలేదని మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కేసీఆర్‌ ప్రభుత్వానికి ఒక ఏటీఎంలా మారిందంటూ ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రంలోని పెద్దలు ఆరోపణలు చేస్తున్నారని, మరి చర్యలెందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. లిక్కర్‌ స్కామ్‌లో నిందితురాలు కల్వకుంట్ల కవితగా చెబుతూ తర్వాత స్థానంలో ఉన్న దిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను ఎందుకు అరెస్టు చేయడంలేదన్నారు. ప్రభుత్వాలు వారి లోపాలను ప్రజలకు తెలియకుండా తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు. తెలంగాణలో 4 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత మందికి ఇచ్చిందో చెప్పాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో పౌష్టికాహారానికి బదులు పురుగుల భోజనం పెడుతున్నారని విమర్శించారు. ఈ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని ఉద్ఘాటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు సాధించంలో తమ పార్టీ నాలుగో స్థానంలో నిలిచిందని, ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేసి బలమైన శక్తిగా నిలవనున్నామని పేర్కొన్నారు. పార్టీ నేతలు ఆర్‌వీ ప్రసాద్‌, రాములు యాదవ్‌, మురళీధర్‌ దేశ్‌పాండే కమలాకర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని