logo

వర్షాభావం.. వరిసాగు తగ్గుముఖం

జిల్లాలో ఈ ఏడాది వానాకాలం వరి సాగు రైతులను కాస్త నిరాశకు గురి చేసింది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే గతేడాది కంటే పంటను ఎక్కువగా సాగు చేయాలనుకున్నారు.

Published : 20 Sep 2023 02:17 IST

న్యూస్‌టుడే, తాండూరు, దోమ

జిల్లాలో ఈ ఏడాది వానాకాలం వరి సాగు రైతులను కాస్త నిరాశకు గురి చేసింది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే గతేడాది కంటే పంటను ఎక్కువగా సాగు చేయాలనుకున్నారు. తీరా వరుణదేవుడు కరుణించలేదు. నాట్లు ఎక్కువగా వేసే ఆగస్టులో వర్షాలు కురవకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకున్నారు.

గతేడాది కంటే తక్కువే..

2022 వర్షాకాలంలో సాగైన వరితో పోల్చితే 2023 వానా కాలంలో సాగైన వరి 62,977ఎకరాల్లో తక్కువగా ఉంది. గతేడాది 1,34,857 ఎకరాల్లో పంటను సాగు చేశారు. ఈఏడాది మాత్రం 71,880 ఎకరాల్లోనే సాగైంది. ఈసారి వర్షాభావ పరిస్థితి, రైతులు ఇతర పంటల వైపు మళ్లడం వంటి పరిస్థితులను అంచనా వేసిన వ్యవసాయ శాఖ వరి సాగు విస్తీర్ణం గతేడాది కంటే తక్కువగా ఉంటుందని భావించింది. ఆ మేరకు అంచనాలను రూపొందించింది. అయితే వర్షాలు అవసరమైన సమయంలో ఎక్కువగా పడక పోవడం, అవసరం లేని సమయంలో కురవడం వంటి పరిస్థితులు సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపాయి. పెరగకుండా చేశాయని అధికారులు వివరిస్తున్నారు.  

రెండు నెలలు ఆశాజనకం

జూన్‌ నుంచి జులై వరకు సాగుకు సన్నద్ధమయ్యేందుకు వాతావరణం అనుకూలంగానే ఉంది. సమయానికి వర్షాలు పడ్డాయి. నార్లు పోసుకున్నారు. పొలాలను సిద్ధం చేశారు. నాట్లు వేసేందుకు పొలాలను కరిగెట్లుగా మార్చే ఆగస్టులో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. చేసేది లేక రైతులు బోర్లు, బావుల ఆధారంగా తోడిన నీటితో కరిగెట్లను చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న నారును వేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ముందుగా అంచనా వేసుకున్న విస్తీర్ణం ప్రకారం సాగు చేయలేక పోయారు. ఆగస్టు 15 వరకు నాట్లు పూర్తయితే పైరుపై చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉండదు. 31లోపు పూర్తయినా చీడపీడల నుంచి కొంత వరకు బయట పడే అవకాశం ఉంది. అయితే ఆగస్టులో ఎక్కువ రోజులు వర్షాలు లేక పోవడంతో రైతులు అయినంత మేరకు పంటను సాగు చేశారు. సెప్టెంబరులో నాట్లు వేస్తే దిగుబడులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలుసుకున్న రైతులు సాగుకు దూరంగా ఉండి పోయారు.


ఇటీవలి వర్షాలతో నీటి కొరత లేదు

జిల్లాలో ప్రస్తుతం సాగైన వరికి నీటి కొరత లేదు. సెప్టెంబరు మొదటి వారం నుంచి రెండో వారం వరకు కురిసిన వర్షాలు చెరువులు, కుంటలు, జలాశయాలను నింపేశాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహించాయి. ఈ పరిణామంతో బోర్లు, బావుల్లోనూ భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం సాగులో ఉన్న పైర్లకు నీటి కొరత ఉండబోదు. దిగుబడులు కూడా ఆశాజనకంగానే వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. క్వింటాలు వరికి మద్దతు ధర కింద రైతులు రూ.2,2023ను పొందవచ్చని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని