logo

పథకం ప్రకారమే రౌడీషీటర్‌ దారుణ హత్య

రౌడ్‌షీటర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మరోకరు పరారీలో ఉన్నాడు. వారి నుంచి మూడు బైకులు, మూడు బాకు కత్తులు, ఐదు చరవాణులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Published : 20 Sep 2023 02:17 IST

కంచన్‌బాగ్‌, న్యూస్‌టుడే: రౌడ్‌షీటర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మరోకరు పరారీలో ఉన్నాడు. వారి నుంచి మూడు బైకులు, మూడు బాకు కత్తులు, ఐదు చరవాణులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను చాంద్రాయణగుట్ట ఏసీపీ కె.మనోజ్‌కుమార్‌, కంచన్‌బాగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.శేఖర్‌రెడ్డి, సౌత్‌ఈస్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ చిట్టి బుర్రతో కలిసి సౌత్‌ఈస్ట్‌ జోన్‌ డీసీపీ చెన్నూర్‌ రూపేష్‌ మంగళవారం వెల్లడించారు. కంచన్‌బాగ్‌లోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన సయ్యద్‌ నసీర్‌ (22) రౌడీషీటర్‌. 2020 సెప్టెంబరులో వ్యక్తిగత ద్వేషాలతో నసీర్‌ అతని అనుచరులు ఇలియాస్‌, అరాఫత్‌, ఇతరులు నసీబ్‌నగర్‌ ఫూల్‌బాగ్‌లోని స్థిరాస్తి వ్యాపారి బాబా షింగ్‌టే అలియాస్‌ బాబా షిండే (52) కుమారుడు విశాల్‌ షింగ్‌టేను హత్య చేశారు. ఛత్రినాకా పోలీసులు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు బెయిల్‌ మీద విడుదలైన నసీర్‌ మరో మిత్రుడితో కలిసి రెండు నెలల క్రితం బాబా షింగ్‌టే మరో కుమారుడు ఆకాష్‌ షింగ్‌టేను బెదిరించాడు. దీంతో నసీర్‌ను హత్య చేసేందుకు కదలికలపై రెక్కీ నిర్వహించారు. ఆకాష్‌ ఫ్లిప్‌కార్టు ద్వారా రెండు బాకు కత్తులు కొనుగోలు చేయగా, హషమాబాద్‌కు చెందిన సయ్యద్‌ షా అబ్దుల్‌ జబ్బార్‌ అలియాస్‌ సులేమాన్‌ (19) గుల్బర్గాలో పుట్టిన రోజు వేడుకలకు వాడే కత్తిని కొనుగోలు చేశాడు. ఈ నెల 12న ఇన్‌స్టాగ్రామ్‌లో సోదరుడి తరహాలో హత్య చేస్తానని ఆకాష్‌ షింగ్‌టేకు నసీర్‌ సందేశం పంపాడు. అదేరోజు అర్ధరాత్రి రెక్కీ నిర్వహించాడు. ఇంటి వద్ద ఆటోలో ఒంటరిగా నసీర్‌ కూర్చొని ఉండటాన్ని గుర్తించారు. హఫీజ్‌బాబానగర్‌ కచీరోడ్‌కు చెందిన ప్రేమ్‌ మనే అలియాస్‌ లడ్డు(19), ఇదే ప్రాంతానికి చెందిన కైఫ్‌ మొహియుద్దీన్‌ అలియాస్‌ ఇర్ఫాన్‌ (19), అథర్‌ (పరారీలో ఉన్నాడు), చాంద్రాయణగుట్ట ఫూల్‌బాగ్‌కు చెందిన షేక్‌ హషమ్‌ అలీ అలియాస్‌ హషీమ్‌ (22) మూకుమ్మడిగా దాడి చేశారు. ఆకాష్‌, సులేమాన్‌లు నసీర్‌ను వెంబడించి దారుణంగా హత్య చేసి పారిపోయారు. ఈనెల 18న నిందితులు ఫలక్‌నుమా రైల్వే ట్రాక్‌ వద్ద ఉన్నారని సమాచారంతో పట్టుకుని వారి వద్ద నుంచి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని