logo

ప్రేమికుడి కోసమే గోవా నుంచి డ్రగ్స్‌

డ్రగ్స్‌ విక్రయిస్తూ దొరికిన వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభాకర్‌రెడ్డి, మహిళా డ్రగ్స్‌ సరఫరాదారు లింగంపల్లి అనురాధ వ్యవహారంలో మరిన్ని పేర్లు బయటపడుతున్నాయి.

Updated : 21 Sep 2023 07:50 IST

పోలీసు కస్టడీలో అనురాధ వాంగ్మూలం

పోలీసుల ఇటీవల స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు

ఈనాడు-హైదరాబాద్‌, శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: డ్రగ్స్‌ విక్రయిస్తూ దొరికిన వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభాకర్‌రెడ్డి, మహిళా డ్రగ్స్‌ సరఫరాదారు లింగంపల్లి అనురాధ వ్యవహారంలో మరిన్ని పేర్లు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గుర్ని అరెస్టుచేసిన రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ, మోకిల పోలీసులు ఇటీవల ప్రభాకర్‌, అనురాధను రెండురోజులు కస్టడీకి తీసుకొచి విచారించారు. ఈ సందర్భంగా అనురాధ నలుగురి పేర్లను బయటపెట్టింది. హర్షవర్ధన్‌రెడ్డి, వినీత్‌రెడ్డి, రవి, గోవాలో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ సూత్రధారి జేమ్స్‌ పేర్లను చెప్పింది. హర్షవర్ధన్‌రెడ్డి, వినీత్‌రెడ్డి, రవి చిరునామా వంటివేవీ తనవద్ద లేవని, అంతా పబ్బుల్లోనే కలిసేవాళ్లమని, అక్కడే సరకు ఇచ్చేవాళ్లమని అంగీకరించినట్లు సమాచారం. గోవాలో ఉండే నైజీరియన్‌ జేమ్స్‌ను అక్కడికి వెళ్లి సంప్రదించడం, సరకు గుట్టుగా నగరానికి తీసుకురావడం వంటి వివరాలను పోలీసుల ముందుంచినట్లు తెలిసింది.  

‘అతడి కోరిక మేరకే దందా’

కస్టడీలో అనురాధ రోదిస్తూ.. తాను ప్రేమించిన ప్రభాకర్‌రెడ్డి కోసమే ఈ డ్రగ్స్‌ దందా చేస్తున్నానంటూ వెల్లడించడంతో అధికారులు నివ్వెరపోయారు. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరానికి చెందిన అనురాధ  వివాహానంతరం భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. డ్రగ్స్‌ అలవాటు చేసుకున్న అనురాధ.. ప్రగతినగర్‌లోని స్నేహితుడి ద్వారా గోవాలో ఉండే జేమ్స్‌తో సంబంధాలు పెంచుకుంది. ఐటీ కారిడార్‌లోని వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభాకర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. సాన్నిహిత్యం పెరిగాక డ్రగ్స్‌ వినియోగం, సరఫరా విషయం ప్రభాకర్‌కు చెప్పింది. అతడు అనురాధ ద్వారా డ్రగ్స్‌ తెప్పించి పరిచయస్తులకు విక్రయించేవాడు. ఈ కేసులో మరిన్ని అరెస్టులుండే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని