logo

బకాయి రావట్లే.. కొలిక్కి తేవట్లే

మహానగరంలో అనేక కాలనీల్లో కీలకమైన కొన్ని నిర్మాణ పనులను చేపట్టకపోవడంతో లక్షలమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated : 23 Sep 2023 03:51 IST

 అర్ధాంతరంగా పనులు ఆపేస్తున్నగుత్తేదారులు
అవస్థలు పడుతున్న కాలనీల ప్రజలు

చింతల్‌బస్తీ-ఆనంద్‌నగర్‌ కాలనీ రోడ్డుపై నిలిచిన కల్వర్టు పనులు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: మహానగరంలో అనేక కాలనీల్లో కీలకమైన కొన్ని నిర్మాణ పనులను చేపట్టకపోవడంతో లక్షలమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పనులు మొదలవడం లేదు. మరికొన్ని చోట్ల మొదలైన వాటిని గుత్తేదారులు అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

కొత్తవి మొదలుపెట్టేదెలా..?

బల్దియా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో కొద్దికాలంగా అనేక సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. తమకు రూ.800 కోట్ల బకాయిలు జీహెచ్‌ఎంసీ చెల్లించలేదంటూ గుత్తేదారులు కొద్దిరోజుల కిందట ధర్నా చేశారు. ఆ తర్వాత రూ.100 కోట్ల వరకు విడుదలైనప్పటికీ గుత్తేదారులు కొత్త పనులు మొదలుపెట్టడానికి సిద్ధంగా లేరు. కొంతమంది టెండర్లలో అయిదారు పనులు దక్కించుకున్నారు. బకాయిల కారణంగా వీటిని ప్రారంభించడం లేదు. దీంతో కొన్నింటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు కాలనీల్లో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలంటూ క్షేత్రస్థాయి అధికారులు గుత్తేదారులను బతిమాలుతున్నా వినడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గుత్తేదారులకు పెద్దఎత్తున నిధులు విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.

ఎక్కడెక్కడంటే..

  • ఖైరతాబాద్‌ పరిధిలోని ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి చింతలబస్తీ రోడ్డు కొంత భాగం బుల్కాపూర్‌ నాలాపై ఉంది. ఈ నాలా కింది భాగంలో పైపులు పూడికపోవడంతో వంతెన నిర్మాణం చేపట్టాలని ఆర్నెల్ల కిందట తలపెట్టారు. తవ్వకం మొదలైన వెంటనే నాలా కింది భాగంలో కరెంట్‌ కేబుళ్లు, డ్రైనేజీ పైపు పగలడం తదితర కారణాలతో ఐదు నెలలుగా పనులు నిలిపివేశారు. దీంతో ఈ రోడ్డును పూర్తిగా మూసివేశారు. ఆరేడు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
  • అత్తాపూర్‌లో కాంతారెడ్డినగర్‌ నుంచి సోమిరెడ్డినగర్‌ మీదుగా వర్షం నీటి కోసం నాలా కొన్నేళ్ల కిందటే నిర్మించారు. రెండేళ్ల కిందట సోమిరెడ్డినగర్‌లో సీసీరోడ్డు వేస్తుండగా రోడ్డు కొంత భాగం నాలాలోకి కూలింది. దీంతో రోడ్డుకు నాలాకు మధ్య 100 మీటర్ల వరకు పొడవైన గుంత పడి ప్రమాదకరంగా మారింది. దీని నిర్మాణం కోసం అధికారులు టెండర్లు పిలిచారు. రెండేళ్లయినా ఎవరూ ముందుకు రావడంలేదు.  
  • కాప్రా సర్కిల్‌ మంగాపురం నుంచి కృష్ణానగర్‌ వరకు బాక్సు డ్రైన్‌ నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు కిలో మీటరు పొడవున రోడ్డు తవ్వేశారు. దాన్ని బాగు చేయకపోవడంతో అనేక కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని