logo

స్త్రీలు, పురుషులు, సమాజంపై పరిశోధన, అధ్యయనం

ఇంటర్‌ పూర్తయ్యాక ఇంజినీరింగ్‌, మెడిసిన్‌.. వీటిలో సీట్లు రాకపోతే బీఎస్సీ కంప్యూటర్స్‌, గణితం, పీజీలో ఎంఏ, ఎంకాం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కనిపించే అవకాశాలివే.

Published : 23 Sep 2023 03:41 IST

పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు
సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌ వినూత్న పంథా

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ పూర్తయ్యాక ఇంజినీరింగ్‌, మెడిసిన్‌.. వీటిలో సీట్లు రాకపోతే బీఎస్సీ కంప్యూటర్స్‌, గణితం, పీజీలో ఎంఏ, ఎంకాం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కనిపించే అవకాశాలివే. వీటికి ప్రత్యామ్నాయంగా డిగ్రీ, పీజీ స్థాయిలో కొత్త కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి ప్రదర్శించినా, వారి స్నేహితులు, తల్లిదండ్రులు వారిస్తున్నారు. కొత్త కోర్సులు, పరిశోధనల లక్ష్యాలున్న విద్యార్థులకు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రోత్సాహమందిస్తోంది. స్త్రీ, పురుషులు, సమాజంపై పరిశోధన, అధ్యయనంపై పీజీ, పీహెచ్‌డీలో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. దేశవిదేశాల్లో స్త్రీలు, పురుషుల జీవన పరిస్థితులు, సమాజంపై వాటి ప్రభావంపై అధ్యయనం, పరిశోధనల సమాచారాన్ని విద్యార్థులకు అందించి మరిన్ని కొత్త కోణాలు తెలుసుకుని పరిశోధన పత్రాలు సమర్పించేలా ఆచార్యులు మార్గనిర్దేశనం చేస్తున్నారు.

జెండర్‌ స్టడీస్‌లో పీజీ

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్యం, కట్టుబాట్లు, ఆచారాలతోపాటు వేర్వేరు అంశాలు అధ్యయనం చేసేందుకు మూడేళ్ల కిందట కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థినులకు అర్హత పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నారు.

వృత్తి నిపుణులు, ఆచార్యులుగా కొలువులు

స్త్రీలు, పురుషులు, సమాజ స్థితిగతులపై అధ్యయనం, పరిశోధన చేసిన విద్యార్థినులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూల తరహాలో కాకపోయినా వేగంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వృత్తి నిపుణులుగా ఉద్యోగాలొస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు బాగా ప్రోత్సహిస్తున్నాయని సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌ విభాగాధిపతి కె.సునీతారాణి తెలిపారు. విద్యార్థులు సమాచారం సేకరిస్తున్నారని, వాటికి మరిన్ని అంశాలను జోడించి విద్యాశాఖకు ‘ఉపాధ్యాయుల కరదీపిక’, ‘విద్యార్థుల కరదీపిక’ బుక్‌లెట్‌లు అందించామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని