logo

స్త్రీనిధి.. నెమ్మది!

గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు పూచీకత్తు లేకుండా అందించే స్త్రీనిధి రుణాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

Published : 23 Sep 2023 03:41 IST

ప్రత్యేక ప్రణాళికతో సాగితేనే ప్రయోజనం
పది శాతమే పూర్తి

న్యూస్‌టుడే,   తాండూరుగ్రామీణ: గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు పూచీకత్తు లేకుండా అందించే స్త్రీనిధి రుణాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గంటలు, రోజుల వ్యవధిలో అందించే లక్ష్యం నీరుగారుతోంది. ఆరు నెలల్లో కేవలం పది శాతమే చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నెలల్లో ప్రణాళికతో ముందుకు సాగితేనే నిర్దేశించిన గమ్యం చేరి, అతివల స్వయం సమృద్ధికి అడుగులు పడనున్నాయి.

స్వయం సహాయక సంఘాల్లో చేరిన మహిళలు ఆసక్తి ఉన్న వ్యాపారం, పాడిపశు పోషణ, అంతర్జాల కేంద్రం, బ్యూటీపార్లర్‌, వ్యవసాయం, అలంకార వస్తు విక్రయం, దుస్తుల విక్రయ దుకాణాలు, దర్జీ వృత్తి, విగణిత కేంద్రం, మగ్గం వర్క్స్‌ వంటి స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్‌) ప్రోత్సహిస్తోంది. ఆయా వ్యాపారాలు, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని ఎలాంటి తాకట్టు లేకుండా స్త్రీనిధి రుణంతో సమకూర్చుతోంది. 48 గంటల నుంచి రెండు వారాల వ్యవధిలో రుణాలను అందిస్తోంది. రూ.25వేల నుంచి రూ.3లక్షల దాకా  ఇచ్చేవాటికి 92పైసల వడ్డీ విధిస్తోంది. తిరిగి 24 నుంచి 60 నెలల సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. తరుణీమణులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు అనువుగా అందిస్తున్న ఈ విధానం నిదానంగా సాగుతోంది.  

గతంలో 14వ స్థానం..

గత ఆర్థిక సంవత్సరంలో 73 శాతం రుణాలు పంపిణీ చేయడంతో రాష్ట్రంలో జిల్లా 14వ స్థానానికి చేరింది. ఈసారి అంతకుమించి అందించి మరింత ముందు వరసలో నిలవాల్సి ఉండగా వెనుకబడ్డారు. జిల్లాలో అత్యధికంగా 21 శాతం పంపిణీతో బంట్వారం మండలం ప్రథమ స్థానంలో ఉండగా, 0.65 శాతంతో తాండూరు చివరి స్థానంలో నిలిచింది. కుల్కచర్ల మండలంలో 193 మందికి రూ.1.20కోట్లు మంజూరు చేశారు. నెలకు రూ.12 కోట్ల చొప్పున ఇస్తేనే ఆరు నెలల్లో రూ.73.01కోట్ల లక్ష్యం సాధ్యమవుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్‌ అధికారులు, ఏపీఎంలు, ఐకేపీ సీసీలు, వీఓఏలు చొరవ చూపాల్సి ఉంది.

జిల్లాలో ఇలా..

గ్రామ సమాఖ్యలు: 657

స్వయం సహాయక సంఘాలు: 16,589

నమోదైన సభ్యులు: 1,63,522

స్త్రీనిధి లక్ష్యం: రూ.81.13 కోట్లు

ఇచ్చింది: రూ.8.12 కోట్లు

ఇవ్వాల్సింది: రూ.73.01 కోట్లు

గడువు: ఆరు నెలలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని