logo

నిమజ్జనం.. శోభాయమానం

తాండూరులో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది.

Published : 23 Sep 2023 03:41 IST

తాండూరు టౌన్‌, తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: : తాండూరులో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించారు. పట్టణవాసులతో పాటు, పల్లె ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ బందోబస్తును పర్యవేక్షించారు. పాత తాండూరు గడీ ప్రాంతంలో ముస్లిం పూలు చల్లి స్వాగతం పలికారు. సాయంత్రం ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగింది. భారీ విగ్రహాలను ట్రాక్టర్ల్లు ఇతర వాహనాల్లో గంగమ్మ ఒడికి తరలించారు. భద్రేశ్వర దేవాలయం వద్ద హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజుగౌడ్‌, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి నర్సింహులు స్వాగతం పలికారు. వరసిద్ధి వినాయక దేవాలయం వద్ద, తులసీనగర్‌లో మట్టి వినాయకులను ఉన్న చోటనే  నిమజ్జనం చేశారు. గౌతాపూర్‌లో మల్లికార్జున వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వినాయక మండపం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రహేళిక పోటీల్లో విజేతలైన యువకులు శ్రీకాంత్‌, రమేష్‌గౌడ్‌, సాయిప్రసాద్‌, ఖలీల్‌పాషకు రూ.10,500 నగదు ప్రోత్సాహకాలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల సంఘాధ్యక్షులు నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు జన్నెనాగప్ప, భారాస కన్వీనర్‌ శకుంతల, నాయకులు రాంచంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి చేతుల మీదుగా అందజేసి అభినందించారు. వినాయక చేతిలో ఐదు రోజులపాటు పూజలందుకున్న గణపతి లడ్డూలను పాండురంగారెడ్డి రూ.80,116కు, మోహన్‌రావు దేశ్‌పాండే రూ.75వేలకు, జన్నె లక్ష్మణ్‌ కలశాన్ని రూ.30వేలకు వేలంపాట ద్వారా పొందారు.

పర్యవేక్షిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని ఊరేగింపుగా కలెక్టర్‌ కార్యాలయం పక్కనే ఉన్న కుంటలో శుక్రవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. పాలనాధికారి నారాయణరెడ్డి, అదనపు పాలానాధికారులు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్‌, జిల్లా అధికారులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. లడ్డూలను రెవెన్యూ సిబ్బంది అరుణ్‌కుమార్‌ రూ.2,22,222కు, శ్రీనివాస్‌ రూ.2.20 లక్షలకు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వరసిద్ది వినాయక ఆలయంలో నిమజ్జనం చేస్తున్న కాలనీ వాసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని