logo

అనిశా నుంచి త్రుటిలో తప్పించుకున్న అధికారి!

హైదరాబాద్‌ ప్రాంతీయ పరిధిలో ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల ఉన్నతీకరణ(అప్‌గ్రేడ్‌)కు అనుమతులు ఇవ్వాల్సిన అధికారుల్లో కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు.

Published : 23 Sep 2023 05:04 IST

పాఠశాల ఆర్జేడీ కార్యాలయం కేంద్రంగా అక్రమాల్ఠు

ఆర్జేడీ కార్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, గన్‌ఫౌండ్రి: హైదరాబాద్‌ ప్రాంతీయ పరిధిలో ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల ఉన్నతీకరణ(అప్‌గ్రేడ్‌)కు అనుమతులు ఇవ్వాల్సిన అధికారుల్లో కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. పాఠశాలల ప్రతినిధుల నుంచి రూ.వేలు, రూ.లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లా ఫారుక్‌నగర్‌ పాఠశాల ఉన్నతీకరణకు రూ.80వేలు లంచం పుచ్చుకొంటూ పాఠశాల ఆర్జేడీ కార్యాలయం అధికారులు సాయిపూర్ణచంద్రరావు, జగ్జీవన్‌, సతీష్‌లు గురువారం సాయంత్రం అనిశా అధికారులకు పట్టుబడిన విషయం విదితమే. ఈ అవినీతి వ్యవహారం వెనుక ఓ కీలక అధికారి హస్తం ఉన్నట్టు  సమాచారం. లంచం తీసుకోకుండా ఆ అధికారి త్రుటిలో తప్పించుకున్నారని తెలిసింది.  
సింహభాగం ఆయనకే.. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న పాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయం... మల్టీ జోన్‌ పరిధిలో 4 వేలకు పైగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలున్నాయి. ప్రీ-పైమరీ, ప్రైమరీ, హైస్కూల్‌ల ఉన్నతీకరణ(అప్‌గ్రేడ్‌)కు సంబంధించిన అంశాలను ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయం పర్యవేక్షిస్తోంది. జిల్లా విద్యాశాఖాధికారుల నివేదిక ఆధారంగా అనుమతులను మంజూరు చేస్తోంది. అనుమతులు ఇచ్చేందుకు లంచం ఇవ్వాలని కీలక అధికారి కొద్దినెలల క్రితం హకుం జారీ చేశారు.  లంచం సొమ్ములో ఆయనకు 60శాతం ఇవ్వాలి. మిగిలింది పంచుకోవాలి. అప్పటి నుంచి దక్షిణ సమర్పించిన వారికి అనుమతులు వస్తున్నాయి. కీలక అధికారికి సహాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి డబ్బులిచ్చి గంటల వ్యవధిలో అనుమతి పత్రాలు తీసుకెళ్తున్నారని అనిశా అధికారులు వివరాలు సేకరించారు.

చక్రం తిప్పుతున్న ముగ్గురు అధికారులు  

పాఠశాల ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో ముగ్గురు అధికారులు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. కీలక అధికారికి సన్నిహితంగా ఉంటున్న ఈ ముగ్గురు అవినీతి, అక్రమాలను చాకచక్యంగా నిర్వహిస్తున్నారని తెలిసింది. ఒక్కో ప్రైవేటు పాఠశాల నుంచి రూ.60వేల నుంచి రూ.80వేలు, కార్పొరేటు పాఠశాల నుంచి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకూ వసూలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ ముగ్గురిలో ఒక అధికారి లంచం సొమ్మును వాటాలుగా పంచి ఇస్తున్నారు. అనిశా అధికారులు ఆయనను పట్టుకున్నప్పుడు రూ.80వేలతో పాటు మరో రూ.50వేలు కూడా అతడి వద్ద ఉన్నాయి. ఇవి ఎవరి డబ్బులని అధికారులు ప్రశ్నించగా.. సమాధానం ఇవ్వకపోవడంతో రూ.50వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడైతే లంచాలు వస్తాయన్న అంచనాతో ముగ్గురిలో ఓ జూనియర్‌ అధికారి అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులతో కీలక అధికారికి తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని