logo

విత్తన లోపం.. అన్నదాతకు శాపం

పంటల సాగులో మేలు జరుగుతుందంటే ఇచ్చిన విత్తనాలతో సాగు చేసుకుంటారు. చెప్పిన విధానాలు పాటిస్తారు. కానీ ఎదుగుతున్న పంట చేతికొచ్చే దశలో కాత, పూత లేకపోతే ఆందోళన చెందుతూ ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన చెందుతారు.

Updated : 24 Sep 2023 04:02 IST

పూత, కాతలేని పచ్చజొన్న
న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం, దౌల్తాబాద్‌

కంకులు లేని పంటను చూపుతున్న రైతు భీమప్ప

పంటల సాగులో మేలు జరుగుతుందంటే ఇచ్చిన విత్తనాలతో సాగు చేసుకుంటారు. చెప్పిన విధానాలు పాటిస్తారు. కానీ ఎదుగుతున్న పంట చేతికొచ్చే దశలో కాత, పూత లేకపోతే ఆందోళన చెందుతూ ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన చెందుతారు. ఇలాంటి పరిస్థితిని ప్రస్తుతం పచ్చజొన్న సాగు రైతులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

కిలో రూ.100కు కొనుగోలు

కొడంగల్‌ నియోజకవర్గం దౌల్తాబాద్‌ మండలంలోని గోకఫస్లాబాద్‌, దౌల్తాబాద్‌, నీటూరు గ్రామాలకు చెందిన 20 మంది రైతులకు ‘వాసన్‌’ సంస్థ ప్రతినిధులు విత్తనాలు ఇచ్చారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులతో కొనసాగుతున్న ‘పరస్పర రైతు సహకార సంఘం’ వాసన్‌ సహకారంతో అమలవుతోంది. రైతు సంఘంలోని ‘విత్తన బ్యాంక్‌’లో భాగంగా జూన్‌ నెలలో పచ్చజొన్న విత్తనాలను అందించగా రైతులు కిలో రూ.100 చొప్పున డబ్బులు కట్టి కొనుగోలు చేశారు.

మార్కెట్లో మంచి డిమాండ్‌

చక్కెర వ్యాధి బాధితులు రొట్టెలతో భోజనం చేయడానికి పచ్చజొన్నలనే కొనుగోలు చేస్తారు. వానాకాలం పంటగా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తుండగా పచ్చజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధరను ఈ ఏడాదిలో రూ.3,180 ప్రకటించగా డిమాండ్‌ కారణంగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు ధర రూ.13,500 వరకు పలుకుతుందని రైతులు అంటున్నారు. అందుకు విత్తనాలు తీసుకున్న రైతులు మూడు గ్రామాల్లో సుమారు 40 ఎకరాల్లో పచ్చజొన్న పంటల సాగుకే మొగ్గుచూపారు. మూడు నెలల తర్వాత  కంకుల దశకు వస్తుండగా వాసన్‌ సంస్థ సహకారంతో అందించిన విత్తనాలతో వచ్చిన పంటకు పూత, కాత లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి భూమి స్వభావంతో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించిన రైతన్నలకు తీవ్ర నష్టం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పంటపొలాలు నిలువునా ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

పంటను కోస్తున్న కూలీలు


పరిహారం చెల్లించాలి

- పద్మమ్మ, మహిళారైతు, నీటూరు

మంచి విత్తనాలని నమ్మి అధిక పెట్టుబడులు పెట్టాం. దిగుబడి లేకపోవడంలో ఆదాయం కోల్పోతున్నాం. ఉన్నతాధికారులు సాగు విస్తీర్ణం గుర్తించి నష్ట పరిహారం చెల్లించాలి. లేకపోతే ఏడాదంతా ఇబ్బందులు తప్పవు.  


రైతుల నుంచే తీసుకొచ్చి ఇచ్చాం

- బుగ్గప్ప, వాసన్‌ సంస్థ సమన్వయకర్త, దౌల్తాబాద్‌

జిల్లాలోని పరిగి ప్రాంతంలో పచ్చజొన్న పంటలు సాగు చేసుకున్న రైతుల నుంచే విత్తనాలు తీసుకొచ్చాం. అక్కడి అన్నదాతలకు ఆర్థిక చేయూత కలిగించగా ఇక్కడి రైతులకు మేలు చేయాలనే ఆలోచించాం. అన్నదాతలకు అండగా నిలిచేందుకు వాసన్‌ కృషి చేస్తుంది.


విచారించి వివరాలు తెలుసుకుంటాం

- శంకర్‌ రాథోడ్‌, వ్యవసాయశాఖ ఏడీ, కొడంగల్‌

దౌల్తాబాద్‌ మండలంలోని మూడు గ్రామాల్లో పచ్చజొన్న సాగు చేసుకున్న అంశంపై పూర్తి విచారణ జరిపి వివరాలు తెలుసుకుంటాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని