logo

స్వీయ మదింపు.. బరితెగింపు

గచ్చిబౌలిలోని ఓ భవనానికి డిసెంబరు 14, 2022న ఆన్‌లైన్‌లో స్వీయ మదింపు ద్వారా పన్ను మదింపు జరిగింది. 1120007476, 1120007477, 1120007478, 1120007479 పీటీఐఎన్‌లతో భవనంలోని ఒక్కో ఇంటికి రూ.4 చొప్పున పన్ను పడింది.

Published : 24 Sep 2023 03:03 IST

రూ.లక్ష తీసుకుని రూ.4 పన్ను విధించిన అధికారులు
శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌ జోన్లలో బేరసారాలు
బల్దియా ఖజానాకు రూ.300 కోట్ల గండి
ఈనాడు, హైదరాబాద్‌

గచ్చిబౌలిలోని ఓ భవనానికి డిసెంబరు 14, 2022న ఆన్‌లైన్‌లో స్వీయ మదింపు ద్వారా పన్ను మదింపు జరిగింది. 1120007476, 1120007477, 1120007478, 1120007479 పీటీఐఎన్‌లతో భవనంలోని ఒక్కో ఇంటికి రూ.4 చొప్పున పన్ను పడింది. ఇంటి విస్తీర్ణాన్ని ఒక చదరపు అడుగుగా(ఎస్‌ఎఫ్‌టీ), కాలనీని మురికివాడగా చూపడంతో పన్ను అంత తక్కువ వచ్చింది. మరుసటి రోజే.. ఆయా ఇంటి నంబర్ల పన్నును సవరించాలని బల్దియాకు ఆన్‌లైన్లో మళ్లీ దరఖాస్తు చేరింది. అందులో వాస్తవ ఎస్‌ఎఫ్‌టీని పేర్కొనడంతో.. పన్ను రూ.31,502కు పెరిగింది. ఒకేసారి వాస్తవ విస్తీర్ణం, చిరునామాను సరిగా పేర్కొంటూ ఆన్‌లైన్‌లో పన్ను మదింపునకు దరఖాస్తు పెట్టుకుంటే మాత్రం.. వాటి పన్ను రూ.45వేల నుంచి రూ.50వేల మేర ఉండేది. పూర్తిస్థాయి    దళారీ అవతారమెత్తిన శేరిలింగంపల్లి సర్కిల్‌ అధికారి ఈ తతంగాన్ని నడిపించారు. రూ.లక్షల్లో పన్ను పడే ఇంటి యజమానులతో బేరాలు కుదుర్చుకుని.. స్వీయ మదింపు విధానాన్ని దుర్వినియోగం చేశారు. ఈ రకంగా.. ఒక్క శేరిలింగంపల్లి సర్కిల్‌ అధికారుల కారణంగా జీహెచ్‌ఎంసీ ఆదాయానికి 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో రూ.50కోట్ల గండి పడింది. నగర వ్యాప్తంగా బల్దియాకు గడిచిన రెండేళ్లలో రూ.300కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. అందుకు సంబంధించిన నకిలీ పన్ను మదింపు ఆధారాలను ‘ఈనాడు’ సేకరించింది. దస్త్రాలను విశ్లేషించగా.. దందాలో కింది స్థాయి నుంచి కేంద్ర కార్యాలయంలోని అదనపు కమిషనర్‌ ఆఫీసులోని కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది.

ఒక్కో ఆర్థిక సంవత్సరం..

  • శేరిలింగంపల్లి సర్కిల్లో ఆర్థిక సంవత్సరం 2022-23లో స్వీయ మదింపు ద్వారా తక్కువ ఎస్‌ఎఫ్‌టీని చూపించి 934 ఇళ్లకు కేవలం రూ.9లక్షల ఆస్తిపన్నును నిర్ధారించారు. వెంటనే మీసేవా కేంద్రాల్లో సవరణ దరఖాస్తులు పడ్డాయి. సవరణ దరఖాస్తుల్లో వాస్తవ ఎస్‌ఎఫ్‌టీని చూపడంతో పన్ను రూ.9లక్షల నుంచి రూ.3.94 కోట్లకు పెరిగింది. మొదటిసారే సరిగ్గా చేస్తే ఆదాయం రూ.5.5కోట్ల మేర ఉండేది.
  • అదే సర్కిల్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్వీయ మదింపు ద్వారా 159 ఆస్తులకు తక్కువ ఎస్‌ఎఫ్‌టీతో రూ.12లక్షల పన్ను విధించారు. సవరణ తర్వాత రూ.1.39 కోట్లకు పెరిగింది. ఒకేసారి వాస్తవ విస్తీర్ణానికి మదింపు చేసి ఉంటే రూ.4 కోట్ల పన్ను పడేది.

అవకాశమిస్తే దుర్వినియోగం..

స్వీయ మదింపు విధానాన్ని 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో పలువురు అవినీతి అధికారులు వసూళ్లకు వనరుగా మార్చుకున్నారు. నేరుగా ఇళ్ల యజమానులను సంప్రదించి.. స్వీయ మదింపు వల్ల నష్టపోతారని భయపెట్టారు. లంచం ఇస్తే.. సగం పన్నుకే ఇంటి నంబరు, పీటీఐఎన్‌ ఇస్తామని బేరాలు కుదుర్చుకున్నారు. ఈ తరహా దందా శేరిలింగంపల్లి జోన్‌లో అత్యధికంగా జరగ్గా.. ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి జోన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని